
అగ్నిమాపక శాఖలో ఏసీబీ కలకలం
- సర్టిఫికెట్ జారీకి లంచం తీసుకుంటూ..
- అవినీతి నిరోధక అధికారులకు చిక్కిన ఉద్యోగి
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్: అగ్నిమాపక శాఖలో అవినీతి బట్టబయలైంది. ఫైర్ సర్వీస్ అటెండెంట్ సర్టిఫికెట్ జారీ కోసం లంచం తీసుకుంటూ లీడింగ్ ఫై ర్‌మన్ లోలం సురేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం ఇక్కడ కల కలం సృష్టించింది. ఏసీబీ డీఎస్పీ సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం, నగర శివారులోని ముబారక్ నగర్‌లో గతనెల 14న రాత్రి ఎన్ జగన్మోహన్‌రావుకు చెందిన ఇండికా విస్టా కారు ను అతని ఇంటి ఎదుటే గుర్తు తెలియని వ్యక్తులు ద హనం చేశారు. బాధితుడు మరుసటి రోజు పోలీసు, అగ్నిమాపక శాఖ, ఇన్సూరెన్స్ (బీమా) కంపెనీకి ఫిర్యాదు చేశారు.
అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే, కారుపై ఇన్సూరెన్స్ పొందడానికి బాధితుడికి ఫైర్ సర్వీస్ అటెండెంట్ సర్టిఫికెట్ అవసరమైంది. ఈ సర్టిఫికెట్ కోసం నగరంలోని అగ్నిమాపకశాఖ అధికారులను ఆశ్రయించాడు. ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఎన్నికల విధులలో ఉండడంతో సర్టిఫికెట్ జారీలో జాప్యం ఏర్పడింది. దీనిని అవకాశంగా తీసుకున్న లీడింగ్ ఫైర్‌మన్ లోలం సురేశ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బాధితుని వద్ద రూ. 10 వేలు లంచంగా డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పడంతో ఇరువురి మధ్య రూ. ఐదు వేలకు ఒప్పందం కుదిరింది.
డబ్బులు కార్యాలయంలో కాకుండా మానిక్‌భండార్‌లోని ఓ కాంప్లెక్స్ వద్ద ఇవ్వాలని లీడింగ్ ఫైర్‌మన్ చెప్పాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని జగన్మోహన్‌రావు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బుధవారం జగన్మోహన్‌రావు నుంచి డబ్బులు తీసుకుంటున్న లీడింగ్ ఫైర్‌మన్‌ను ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ఆర్.రఘునాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
బాధితుడికి సత్వర న్యాయం
బాధితుడు జగన్మోహన్‌రావుకు ఏసీబీ డీఎస్పీ సంజీవరావు వెంటనే ఫైర్ సర్వీస్ అటెండెంట్ సర్టిఫికెట్‌ను జారీ చేయించారు. సత్వర న్యాయం జరిగితేనే బాధితులు న్యాయం కోసం తమ శాఖను ఆశ్రయిస్తారని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 46 కేసులు నమోదు చేసి 52 మంది నిందితులను అరెస్టు చేశమన్నారు. అవినీతి అధికారుల భరతం పట్టడానికి తమ శాఖ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. బాధితులు 9440446155 నంబర్‌కు సంప్రదించాలని ఆయన కోరారు.