
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పెరికి మధుసూదన్‌రెడ్డి ఇంటిపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) శుక్రవారం దాడులు చేసింది. మూసారంబాగ్ డివిజన్ దిల్‌సుఖ్‌నగర్‌లోని వైష్టవీ నెస్ట్ అపార్ట్‌మెంట్‌లో మధుసూదన్‌రెడ్డికి చెందిన 302 ఫ్లాట్‌లో ఉదయం నుంచి ఏసీబీ సిటీ రేంజ్–1 డీఎస్పీ బీవీ సత్యనారాయణ నేతృత్వంలో అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు రావడంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆయన ఇంటితోపాటు బినామీలుగా భావిస్తోన్న రంగారెడ్డి, వికారాబాద్, కొడంగల్, కర్నూల్, చిల్‌మలైవర్ తదితర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేశారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో మధుసూదన్‌రెడ్డి నివసిస్తున్న ఫ్లాట్‌ను రూ.24 లక్షలకు కొని కేవలం రూ.8 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. నగరంలోని మాదాపూర్‌లో రూ.1.81 కోట్లకు కొన్న ఇంటిని కేవలం రూ.91 లక్షల విలువకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. మధుసూదన్‌రెడ్డి వద్ద రూ.3 కోట్ల ఆస్తులకు సంబంధించిన విలువైన కాగితాలు, డాక్యుమెంట్లు గుర్తించినట్లు చెప్పారు. వాటితోపాటు హోండాసిటీ కారు, ఇన్నోవా కారు సీజ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం కేసు నమోదు చేసి మధుసూదన్‌రెడ్డిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. శనివారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మధుసూదన్‌రెడ్డి సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో లెక్చరర్‌గా, ఆయన భార్య విజయలక్ష్మి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, జేఏసీ నేతగా పైరవీలు, ఇంటర్ పేపర్ లీకేజ్‌లతో అక్రమ ఆస్తులు కూడబెట్టారనే సమాచారం మేరకు దాడులు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
నన్నెందుకు టార్గెట్ చేశారో..
‘ఏసీబీ రైడ్‌కు కారణలేంటి, నన్ను ఎందుకు టార్గెట్ చేశారనేదానిపై స్పందించదలుచుకోలేదు. అధ్యాపకుల సంఘం నేతగా అనేక ప్రజాసమస్యలపై, అనేక సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా వాటికి నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పడు నా దగ్గర ఉన్నది లక్ష రూపాయాలు మాత్రమే’ అని మధుసూదన్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment