
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్ శాసనసభ్యత్వాల రద్దుకు దారితీసిన వీడియో ఫుటేజీలను కోర్టుకు సమర్పించడంపై నెలకొన్న వివాదంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డిని బలిపశువును చేశారా? మంగళవారం హైకోర్టులో జరిగిన పరిణామాలను చూస్తే ఔననే సమాధానం వస్తోంది. ఫుటేజీలు సమర్పిస్తానని ఏజీ తనంతట తానుగా హామీ ఇవ్వలేదని, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు సూచన మేరకే ఇచ్చారని నిర్ధారణయింది. ‘ఫుటేజీలు సమర్పిస్తానని నా సూచన మేరకే ఏజీ హామీ ఇచ్చారు’ అని అదనపు ఏజీయే మంగళవారం విచారణ సందర్భంగా కోర్టుకు స్వయంగా నివేదించారు. ఏజీ ఇలా హామీ ఇవ్వడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగ్రహించారని, అందుకే ఆయన రాజీనామా చేశారని వార్తలు రావడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీఎంకు అత్యంత సన్నిహితుడయిన రామచంద్రరావు ఇలా ఒక్కసారిగా తన సూచన మేరకే ఏజీ హామీ ఇచ్చారనడంతో కోర్టు హాల్లోని న్యాయవాదులంతా కంగుతిన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆయన్ను గట్టిగానే నిలదీసింది. ‘ఏజీ హామీతో మీకు ఏ మాత్రం సంబంధం లేదని గత విచారణ సమయంలో చెప్పారుగా! మరిప్పుడేమో మీ సూచన మేరకే మీరు, ఆయన కలిసి హామీ ఇచ్చామని చెబుతున్నారు!! ఈ వైరుద్ధ్యమేమిటి?’ అంటూ ప్రశ్నించింది. ‘ఏదేమైనా ఏజీ హామీని ఈ కోర్టు రికార్డ్ చేసుకుంది. ఆ మేరకు ఫుటేజీ ఇవ్వకుంటే అందులోని అంశాలు మీకు (అసెంబ్లీ కార్యదర్శికి) వ్యతిరేకంగా ఉన్నాయని పరిగణిస్తాం’ అని పునరుద్ఘాటించింది.
కౌంటర్ దాఖలుకు మరింత గడువు కావాలన్న అదనపు ఏజీ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇప్పటికే పలుమార్లు అవకాశమిచ్చామంది. శుక్రవారానికల్లా కౌంటర్లు దాఖలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ‘‘కౌంటర్ల కాపీని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు అందజేయాలి. కోమటిరెడ్డి, సంపత్ బహిష్కరణ ప్రొసీడింగ్స్‌ను కూడా వారికివ్వాలి’’ అని ఆదేశించింది. సోమవారం పూర్తిస్థాయి విచారణ జరుపుతామంటూ విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నిసార్లు గడువివ్వాలి?
అసెంబ్లీ నుంచి తమను బహిష్కరించడాన్ని, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నట్టు నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీని సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టుకు వెళ్లడం తెలిసిందే. హెడ్‌ఫోన్ విసిరి శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్‌ను తాము గాయపరిచామన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రోజు పరిణామాల వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశించాలని కూడా కోరారు. ఆ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై ఆరు వారాల పాటు న్యాయమూర్తి స్టే ఇవ్వడంతో పాటు నాటి వీడియో ఫుటేజీ సమర్పించాలంటూ ఆదేశాలివ్వబోయారు. ఆ అవసరం లేదని, ఫుటేజీ సమర్పిస్తామని ఏజీ హామీ ఇవ్వడం, కానీ ఆ హామీతో తమకు సంబంధం లేదని గత వారం విచారణలో అదనపు ఏజీ చెప్పడం తెలిసిందే.
తాజాగా మంగళవారం విచారణ మొదలవగానే, ఫుటేజీ సమర్పించేందుకు సభ అనుమతి లేదని అదనపు ఏజీ మరోసారి తెలిపారు. ‘‘ఫుటేజీల సమర్పణ పూర్తిగా సభ పరిధిలోని వ్యవహారం. సభ తీర్మానం లేకుండా ఫుటేజీలివ్వడం సాధ్యం కాదు. సభ నిరవధికంగా వాయిదా పడింది. కనుక విచారణ కూడా వాయిదా వేయండి. ఈ వ్యవహారాన్ని సంబంధిత అధికార వర్గాల (అసెంబ్లీ) నిర్ణయానికి వదిలేయండి’’ అని కోరారు. అందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. కౌంటర్ల దాఖలు గురించి ప్రశ్నించారు. డ్రాఫ్ట్ సిద్ధమైందని, తుది రూపు ఇచ్చేందుకు మూడు నాలుగు రోజుల గడువు కావాలని కోరగా తోసిపుచ్చారు. మార్చి 16 నుంచి 27 దాకా పలుమార్లు గడువునిచ్చామని గుర్తు చేశారు. సభ లేదని, సభ తీర్మానం లేకుండా ఫుటేజీ ఇవ్వడం సాధ్యం కాదని అదనపు ఏజీ పలుమార్లు చెప్పడంతో, ‘ఫుటేజీ ఇవ్వకుంటే అందులోని అంశాలు మీకు (అసెంబ్లీ కార్యదర్శికి) వ్యతిరేకంగా ఉన్నట్లు పరిగణిస్తా’ అని స్పష్టం చేశారు. ఫుటేజీలిస్తానని ఏజీ హామీ ఇవ్వడాన్ని, దాన్ని రికార్డు చేయడాన్ని గుర్తు చేశారు.
అదనపు ఏజీ స్పందిస్తూ, తన సూచన మేరకే ఏజీ ఆ హామీనిచ్చారని చెప్పారు. దాంతో ‘మరి ఏజీ హామీతో సంబంధం లేదని గత విచారణ సమయంలో మీరే కదా చెప్పారు!’ కదా అంటూ న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కార్యదర్శి తరఫున ఎవరు హాజరవుతున్నారని ప్రశ్నించారు. ఎవరూ కావడం లేదని, తాను ప్రభుత్వం తరఫునే హాజరవుతున్నానని అదనపు ఏజీ చెప్పారు. ‘‘మీరు అసెంబ్లీ తరఫున హాజరు కానప్పుడు ‘సభ లేదు, తీర్మానం లేదు, ఫుటేజీ ఇవ్వడం కుదరదు’ అంటూ అసెంబ్లీ కార్యదర్శి చెప్పాల్సిన వాదనలు చెబుతున్నారేం?’’ అంటూ న్యాయమూర్తి నిలదీశారు. ‘‘కౌంటర్ల దాఖలుకు మీకు సమయమిస్తా. అయితే ఈ కేసులో ఇప్పటికే ఏజీ వాదనలు ప్రారంభించారు. వాటిని మీరు కొనసాగించండి. ఇంతకు మించి నేను చేయగలిగిందేమీ లేదు. చట్ట ప్రకారం, నేను చేసిన ప్రమాణం ప్రకారమే నడుచుకుంటా’’ అని తేల్చి చెప్పారు. ఈసీ కౌంటర్ సిద్ధమైందని, సంతకాల కోసం పంపామని ఆ సంస్థ తరఫు న్యాయవాది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment