సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్టీల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రవేశ పెట్టాల్సిన పథకాలు, తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని ఎస్టీ ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. ఎస్టీలంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాలని, పేదరికాన్ని తరిమి కొట్టడానికి సమైక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమస్యలుంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. సమస్యలు, ఇబ్బందులను సర్కారు దృష్టికి తీసుకురావాలని కోరారు. ‘రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఎస్టీలున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న ప్రత్యేక గ్రామ పంచాయతీల కోరిక ను నెరవేరుస్తోంది. ప్రత్యేక ప్రగతి నిధి తీసుకొచ్చింది.
ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పింది. ప్రభుత్వ సంకల్పాన్ని ఎస్టీలు అర్థం చేసుకోవాలి’ అని సీఎం అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఎస్టీలకు ఇంకా కొన్ని సమస్యలున్నాయి. కొన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంటు రావడం లేదు. కొన్నింటికి కరెంటే లేదు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, బస్సు సౌకర్యం లేదు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను గుర్తించే విషయం లో సమస్యలున్నాయి. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే వారికి ప్రభుత్వ సాయం విషయంలో చిక్కులున్నాయి. రెవెన్యూ, అటవీ భూముల లెక్కలు తేలక అక్కడక్కడ గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. 1/70 చట్టం అమలు విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఎస్టీ ధ్రువీకరణ పత్రాల సమస్యలున్నాయి. స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకులు సహకరించటం లేదు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు కొన్ని చోట్ల జరగాల్సి ఉంది. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.
ఏం చేస్తే బాగుంటుంది?
ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్య లేంటి, వాటికున్న పరిష్కార మార్గాలేంటి, ఎస్టీలకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టాలి లాంటి అంశాలపై ఎస్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని సీఎం కోరారు. ఓట్ల కోసం కాక ఎస్టీల్లో నిజమైన మార్పు కోసం పనిచేద్దాం అని పిలుపు నిచ్చారు. ఎస్టీ ప్రజాప్రతినిధులంతా శనివారం సమావేశం నిర్వహించుకుని సరైన ప్రతిపాదనలతో ప్రగతి భవన్ రావాలని కోరారు. మరోసారి సమావేశమై ఎస్టీల కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టతకు రావాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment