పెళ్లయిన 23 రోజులకే ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఒళ్లంతా కాలిన గాయాలతో ఉండడంతో ఆమెది ఆత్మహత్యా.. ప్రమాదమా.. ఇంకా ఏమైనా జరిగిందా.. అనేది తేలాల్సి ఉంది.
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన కాముని శ్రీనివాస్, అరుణ దంపతుల కూతురు దివ్య(18)ను ఏప్రిల్ 24న సిరిసిల్ల సుందరయ్యనగర్‌కు చెందిన వేముల వినోద్‌కుమార్‌కు ఇచ్చి పెళ్లిచేశారు. వినోద్‌కుమార్ స్థానికంగా ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం దివ్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంట్లోనుంచి మంటలు రావడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి చల్లార్చారు.
అప్పటికే ఒళ్లంతా కాలిపోయింది. 90 శాతం కాలిన గాయాలతో ఆమెను సిరిసిల్ల ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మున్సిఫ్ మేజిస్ట్రేట్‌కు దివ్యతో మరణ వాంగ్మూలం ఇప్పించేందుకు సిరిసిల్ల టౌన్ ఎస్సై బాలకృష్ణ ప్రయత్నించగా.. ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే కన్నుమూసింది.
దివ్య ఆత్మహత్య చేసుకుందా? ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా..? ఆమెను అత్తింటివాళ్లే హత్య చేశారా..? తెలియడం లేదు. విషయం తెలుసుకుని దివ్య తల్లిదండ్రులు సిరిసిల్లకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. అత్తింటివారే కిరోసిన్ పోసి నిప్పంటించారని ఆరోపించారు. తమ బిడ్డను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని కన్నీరుపెట్టారు. పెళ్లయిన 23 రోజులకే దివ్యకు నూరేళ్లు నిండడం కార్మిక క్షేత్రంలో విషాదాన్ని నింపింది. స్థానిక పోలీసులు దివ్య భర్త వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
పెళ్లయిన 23 రోజులకే...
Published Sun, May 18 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM
Advertisement
Advertisement