ఎన్నికలు జరిగాక సొంత జిల్లాకు వస్తున్న తహశీల్దార్లు తమకు పాత చోటే పోస్టింగులివ్వాలని హఠం వేస్తున్నారు. మరో వైపు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సాయంతో కొందరు తమకు నచ్చినచోట కుర్చీలు దక్కించుకున్నారు. దీనితో బదిలీల వ్యవహారం గందరగోళంగా మారింది. ఆర్డర్లు అందుకున్న పలువురు కొలువులో చేరక తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరికొందరు ట్రిబ్యునల్ తలుపు తట్టి కలెక్టర్ ఆదేశాలపై స్టేలు తెచ్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పాఠశాలల ప్రారంభం, కొత్త ప్రభుత్వ లక్ష్యాల అమలు వంటి కీలక సమయంలో ఈ తంతు పాలనపై ప్రభావం చూపుతోంది. ప్రజలకు చిక్కులు తెచ్చి పెడుతోంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికల సందర్భంగా బదిలీపై వెళ్లి జిల్లాకు తిరిగి వచ్చిన తహశీ ల్దార్లకు పోస్టింగు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వారి పోస్టింగుల్లో రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలకు పెద్దపీట వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బది లీ ఉత్తర్వులు వెలువడి నాలుగు రోజులు కావస్తున్నా ప ది మంది తహశీల్దార్లు కొత్త పోస్టుల్లో నేటికీ చేరడం లే దు. ఎన్నికలకు ముందు తాము పనిచేసిన చోటే తిరిగి పోస్టింగులు ఇవ్వాలంటూ కొందరు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
సొంత జిల్లాలో పనిచేస్తున్న లేదా ఒకే జిల్లాలో మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న తహశీల్దార్లను ఇ తర జిల్లాలకు బదిలీ చేయాలంటూ ఎన్నికల సంఘం ఆ దేశించింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో 37 మంది తహశీల్దార్లను హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తిరిగి వీరిని మహబూబ్‌నగర్ జిల్లాకు బదిలీ చేశారు.
సందట్లో సడేమియా రీతిలో జిల్లాకు పునర్ బదిలీపై వచ్చిన 37 మందితో పాటు మ రో 19 మంది తహశీల్దార్లకు స్థానం కలిగిస్తూ కలెక్టర్ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 12 తేదీ అర్దరాత్రి బదిలీ ఉత్తర్వులు విడుదల చేయగా, తాము కోరుకున్న చోట పోస్టింగు దక్కించుకున్న తహశీల్దార్లు 13వ తేదీ ఉదయం విధుల్లో చేరారు. అయితే తమకు అనుకూలంగా లేని చోట పోస్టింగు దక్కలేదంటూ మరో పది మంది తహశీల్దార్లు నేటికీ రిపోర్టు చేయలేదు. జ్యోతి (తాడూరు), గోపాల్‌నాయక్ (పెద్దకొత్తపల్లి), చంద్రశేఖర్ (మద్దూరు), మంజుల (నారాయణపేట), చెన్నకిష్టప్ప (మాగనూరు), నర్సింగరావు (మానవపాడు), దానప్ప (ఊట్కూరు), రాములు (నాగర్‌కర్నూలు, ఏఓ), రాజేందర్‌రెడ్డి (గద్వాల), వెంకటలక్ష్మి (కలెక్టరేట్ ఎఫ్ సెక్షన్) విధుల్లో చేరని వారిలో ఉన్నారు. తహశీల్దార్ల పోస్టింగుల్లో రాజకీయ ఒత్తిళ్లతో పాటు, పైరవీలకు పెద్ద పీట వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే మండలాల్లో పోటీ పడి మరీ తహశీల్దార్లు పోస్టింగులు దక్కించుకున్నారు. బదిలీల్లో శాస్త్రీయత పాటించలేదంటూ ఓ ఉద్యోగ సంఘం అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది.
పాత చోటే పోస్టింగులు
గతంలో తాము పనిచేసిన చోటే తిరిగి పోస్టింగులు ఇవ్వాలంటూ కొందరు తహశీల్దార్లు కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. బదిలీపై వెళ్లి తిరిగి వచ్చిన వారికే పోస్టింగులు ఇవ్వాల్సి వుండగా, జిల్లాలో పనిచేస్తున్న మరో 19 మందిని బదిలీ జాబితాలో చేర్చడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తాము కోరుకున్న తహశీల్దార్లకే కేటాయించాలంటూ ఒత్తిళ్లు చేసి సఫలమైనట్లు బదిలీలు జరిగిన తీరు వెల్లడిస్తోంది.
షాద్‌నగర్, కొత్తకోట, కేశంపేట, వెల్దండ, జడ్చర్ల, అడ్డాకుల, కొత్తకోట తదితర మండలాల్లో తహశీల్లార్ల పోస్టింగులపై ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఓ కీలక అధికారి బదిలీల్లో చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పొరుగునే వున్న రంగారెడ్డి జిల్లాలో స్థానచలనం అంశంపై కొందరు తహశీల్దార్లు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి కలెక్టర్ ఉత్తర్వులపై స్టే పొందారు. దీంతో జిల్లాకు చెందిన తహశీల్దార్లు కూడా కోరుకున్న చోట పోస్టింగు దక్కక పోవడంతో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆ కుర్చీలే కావాలట..!
Published Wed, Jun 18 2014 3:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement