
క్షమాభిక్షకు అంగీకారం
దుబాయ్‌లో ఉరిశిక్ష పడ్డ ఖైదీని కాపాడేందుకు ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన యాదగౌడ్ చేసిన కృషి ఫలించింది.
ఆర్మూర్: దుబాయ్‌లో ఉరిశిక్ష పడ్డ ఖైదీని కాపాడేందుకు ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన యాదగౌడ్ చేసిన కృషి ఫలించింది. బాల్కొండ మండలం మెండోరా గ్రామానికి చెందిన మాకూరి శంకర్‌కు క్షమాభిక్ష లేఖ ఇవ్వడానికి రాజస్థాన్‌కు చెందిన మృతుడు రామావతార్ కుమావత్ కుటుంబసభ్యులు అంగీకారం తెలిపినట్లు దేగాం యాదగౌడ్ బుధవారం తెలిపారు. క్షమాభిక్ష లేఖను సాధించడం కోసం దేగాం యాదగౌడ్ రాజస్థాన్‌లోని జున్‌జున్‌హు జిల్లా తిట్టన్‌వాడ్ గ్రామానికి ఐదు రోజుల క్రితం వెళ్లాడు.
మృతుడి కుటుం బానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని అక్కడి పెద్దమనుషులు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి ఓం ప్రకాష్ రూ. ఐదు లక్షలు విరాళంగా ఇవ్వడానికి అంగీకరించాడని, మిగిలిన ఐదు లక్షల రూపాయలను స్థానికంగా విరాళాల రూపంలో సేకరిస్తానని యాదగౌడ్ వివరించారు. రూ. పది లక్షలు మృతుని కుటుంబీకులకు అందజేస్తే వారు క్షమాభిక్ష లేఖ ఇస్తారని, తద్వారా దుబాయ్ చట్టం ప్రకారం శంకర్‌కు ఉరిశిక్షను రద్దు చేయించడానికి అవకాశం ఉందన్నారు.
అసలేం జరిగింది..
బాల్కొండ మండలం మెండోరాకు చెందిన మాకూరి శంకర్ వ్యవసాయ కూలీ. 2004లో దుబాయ్‌కి వెళ్లి అక్కడ ఒక కంపెనీలో ఫోర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను దుబాయ్ వెళ్లే సమయంలో భార్య గర్భవతి. కొడుకు పుట్టినా శంకర్ స్వస్థలానికి రాలేదు. 2009లో అతనితో పాటు పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడు. దీంతో ఫోర్‌మెన్‌గా ఉన్న శంకర్‌పై హత్యానేరం మోపి దుబాయ్‌లోని ఫుజీరా జైలులో బంధించారు. దుబాయ్ చట్టం ప్రకారం హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి ఉరిశిక్ష విధిస్తారు.
శంకర్ తన దీనస్థితిని జైలులోనే అందుబాటులో ఉండే ఫోన్ ద్వారా తన కుటుంబసభ్యులకు తెలి యజేశాడు. తనకు పుట్టిన కొడుకుకు పన్నెండేళ్లు వచ్చినా కూడా చూసుకోలేని దీన స్థితి నుంచి తనను కాపాడాలని వేడుకున్నాడు. అతని భార్య భూదేవి రాజకీయ నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతూ తన భర్తను కాపాడాలని కోరుతోంది. విషయం తెలుసుకున్న దేగాం యాదగౌడ్ బాధితులకు అండగా నిలిచాడు. శంకర్ ప్రాణాలు కాపాడటానికి రాజస్థాన్‌కు వెళ్లాడు. హత్యకు గురైన వ్యక్తి కుటుంబసభ్యులను కలసి క్షమాభిక్ష లేఖ ఇచ్చే విధంగా ఒప్పించాడు. కానీ, రూ.10 లక్షల సాయమందించాలని మృతుని కుటుంబీకులు కోరారు. ఈ మేరకు రూ.5 లక్షలు ఇచ్చేందుకు అక్కడి ఓ వ్యాపారి ముందుకు వచ్చాడు. మరో రూ.5 లక్షలను తెలంగాణ ప్రభుత్వం సమకూరిస్తే శంకర్‌ను సులభంగా ఉరిశిక్ష నుంచి తప్పించి స్వస్థలానికి చేర్చవచ్చని యాదగౌడ్ అంటున్నారు.