ఒప్పందమే కుదిరింది!
మహారాష్ట్ర ఇరిగేషన్ ఎస్‌ఈఈ
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలతో అధికారుల సమావేశం
కాళేశ్వరం : మేడిగడ్డ బ్యారేజీవిషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు పోవద్దని ఒప్పందం మాత్రమే కుదిరిందని.. ఎత్తు నిర్ణయం ఆమోదం కాలేదని మహారాష్ట్ర నీటి పారుదల శాఖ ఎస్‌ఈ కుల్దీప్ రాంటెంకీ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు ఈనెల 8న ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచాలో శనివారం ఎస్‌ఈ కుల్దీప్ రాంటెంకీ, తహశీల్దార్ అశోక్ గోదావరి పరివాహక పెంటిపాక, తూమునూరు, అయిపేట గ్రామస్తులతో సమావేశమయ్యూరు.
అనంతరం ఎస్‌ఈ విలేకరులతో మాట్లాడారు. ముంపు లేకుండా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 103, 102, 101 మీటర్ల ఎత్తులో సూత్రప్రాయంగా ఆలోచనకు వచ్చినప్పటికీ ఇంకా ఖరారు కాలేదన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి ముంపు లేదని ఆలోచనకు వచ్చిన తర్వాతే బ్యారేజీ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం బ్యారేజీ డీఈఈ భద్రయ్య పాల్గొన్నారు.