భూముల అన్వేషణ
- ‘ఎయిమ్స్’ ఏర్పాటు కోసం
- జల్లెడ పడుతున్న జిల్లా యంత్రాంగం
- రెండు ప్రాంతాల్లో అనువైన స్థలాల గుర్తింపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ర్టంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడంతో భూముల అన్వేషణపై యంత్రాంగం దృష్టి సారించింది. హైదరాబాద్ నగరానికి చేరువలోనే ఈ ప్రాజె క్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో చర్యలకు దిగిన అధికారులు శేరిలింగంపల్లిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివాదరహిత భూమిని గుర్తించారు. అదేవిధంగా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లోనూ అనువైన స్థలం ఉందని నిర్ధారించారు.
అన్నీ ఒక్క చోటేనా! హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం, సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో అనువైన భూములు అందుబాటులో ఉండడంతో పలు ప్రాజెక్టులు జిల్లాలో ఏర్పాటయ్యాయి. హైటెక్ సిటీ మొదలు కీలక ఐటీ సంస్థలు, టీఐఎఫ్‌ఆర్, ఐఎంజీ భారత్ తదితర సంస్థలన్నీ శేరిలింగంపల్లి మండల పరిధిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో శరవేగంగా అభివృద్ధి చెందిన శేరిలింగంపల్లిలో తాజాగా ఎయిమ్స్ ఏర్పాటు చేయడంపై పలువర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కీలక సంస్థలన్నీ ఒకేచోట ఏర్పాటైతే.. మిగతా ప్రాంతం అభివృద్ధిపై ప్రభావం పడుతుందని జిల్లా యంత్రాంగం సైతం వాదిస్తోంది. ఈ క్రమంలో శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు అంశంపై పరిశీలన చేస్తోంది. జవహర్‌నగర్‌లో దాదాపు వెయ్యి ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించిన జిల్లా యంత్రాంగం.. ఈ మేరకు నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది
ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం..
జిల్లాలోనే ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించగా.. ఈమేరకు భూముల పరిస్థితిని పరిశీలించాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన కలెక్టర్ సహా రెవెన్యూ అధికారులు శేరిలింగంపల్లిలోని సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో, శామీర్‌పేట మండలం జవహర్‌నగర్ సమీపంలో స్థలాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఈ ఫైలును సీఎం కేసీఆర్ పరిశీలించిన తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకమని అధికారవర్గాలు చెబుతున్నాయి.