
సాక్షి, హైదరాబాద్: సాధ్యమైనంత వరకు నిర్ణీత గడువు కంటే ముందే ఎయిమ్స్ వైద్య సేవలు రాష్ట్ర ప్రజలకు అందుతాయని వైద్య, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మా రెడ్డి పేర్కొన్నారు. ఎయిమ్స్ సేవలను వేగంగా అందించేందుకే దాదాపు నిర్మాణం పూర్తయిన బీబీ నగర్ నిమ్స్ ఆçస్పత్రిని ఎయిమ్స్‌కి అప్పగించామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించిందని, సీఎం కేసీఆర్, ఎంపీలు, నాడు మంత్రిగా తాను అనేక సందర్భాల్లో చేసిన ప్రయత్నాల ఫలితం గా ఎయిమ్స్ వచ్చిందని గుర్తుచేశారు. ఎయి మ్స్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్రానికి, ప్రధానిని కలసి తీవ్రంగా ప్రయత్నించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఎయిమ్స్‌ని ప్రకటించిన కేంద్రం తెలంగాణను విస్మరించిందని పేర్కొన్నారు. దీంతో అప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, జేపీ నడ్డాలను కలిశానని గుర్తు చేశారు. నడ్డా ఇక్కడకు వచ్చిన సమయంలోనూ ఎయిమ్స్ కోసం లేఖలు ఇచ్చామని తెలిపారు. ఇదే సమయంలో కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి తెలంగాణ ఎయిమ్స్ కోసం విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ఎయిమ్స్ ఇవ్వాలని అనేక సందర్భాలలో పట్టుబట్టారని గుర్తుచే శారు. కేంద్ర మంత్రివర్గం సోమవారం బీబీనగర్ నిమ్స్ ఉన్న చోటే ఎయిమ్స్‌కి పచ్చజెండా ఊపడంపై సంతోషం వ్యక్తం చేశారు. తొలిదశ పనులు ఈ ఏడాదిలోపే ప్రారంభమవుతాయని, ఈ లోగా ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దీని కోసం నోటిఫికేషన్ వేశారని, ఓపీనీ త్వరగా ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు.