
ఇప్పుడు ఆకలంటే.. ఐదేళ్లకు బిర్యానీయా?
ఆకలితో ఉన్నవాడికి ఒక రొట్టె, గుక్కెడు మంచి నీళ్లు ఇస్తే చాలు.
సర్కారుకు అక్బరుద్దీన్ ప్రశ్నలు
విద్యుత్‌పై ప్రణాళిక ఉందా?
ఛత్తీస్ కరెంటు ఎప్పుడు వస్తుంది?
విద్యుత్ తెచ్చేందుకు లైన్లున్నాయా?
ఉర్దూలో సమాధానమిచ్చిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆకలితో ఉన్నవాడికి ఒక రొట్టె, గుక్కెడు మంచి నీళ్లు ఇస్తే చాలు. అయిదేళ్ల తర్వాత బిర్యానీ పెడ్తానంటే ఏం ప్రయోజనం?’’ అంటూ విద్యుత్ సమస్యపై మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం అసెంబ్లీలో సర్కారుపై ధ్వజమెత్తారు. కేంద్రం 24 గంటల విద్యుత్ సరఫరా పథకంలో తెలంగాణను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఢిల్లీ, రాజస్థాన్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చోటు కల్పించి తెలంగాణను ఎందుకు విస్మరించిందన్నారు.
ఏపీ ప్రభుత్వం 53.89 శాతం విద్యుత్ వాటాను ఇవ్వకపోవడం వల్లే తెలంగాణలో కరెంట్ కొరత తీవ్రతరమైందని పేర్కొన్నారు. విద్యుత్ కష్టాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని మండిపడ్డారు. ఛత్తీస్‌తో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూను సభకు అందజేయాలని కోరారు. ‘‘అక్కడ మిగులు విద్యుత్ ఉందా? అదెప్పుడు వస్తుంది? అందుకు లైన్లున్నాయా? వాటికెంత ఖర్చవుతుంది? బడ్జెట్టులో నిధులేమైనా కేటాయించారా? ఒక్క మెగావాట్ విద్యుదుత్పత్తికి రూ.6 కోట్లు కావాలని అంచనా. ఈ లెక్కన ప్రభుత్వం చెబుతున్న 20 వేల మెగావాట్ల ఉత్పత్తికి రూ.1.2 లక్షల కోట్లు కావాలి. ఇది రాష్ట్ర బడ్జెట్‌తో సమానం.
ఇంత ఖర్చెలా భరిస్తారు? 4 వేల మెగావాట్ల ఎన్‌టీపీసీ ప్లాంట్‌కు 4,000 ఎకరాలు, 20 వేల మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి 20 వేల ఎకరాలు కావాలి. సాధ్యమేనా? తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్టులు ఎక్కువ. వాటికే 7,150 మెగావాట్ల విద్యుత్ అవసరం. అసలు 20 వేల మెగావాట్లు ఉత్పత్తి చేసినా ఐదేళ్ల తర్వాత ఎంత డిమాండ్ ఉంటుంది? దాన్ని అందుకోగలమా? ఈ దిశగా భావి ప్రణాళికలున్నాయా?’’ అని ఒవైసీ ప్రశ్నించారు. నేషనల్ గ్రిడ్‌లో చేర్చి 24 గంటల విద్యుత్ అందించేందుకు కేంద్రం ప్రతిపాదనలు కోరితే తెలంగాణ ఆలస్యంగా స్పందించినట్టు కేంద్రమంత్రి తమతో చెప్పారని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. అనంతరం ఒవైసీ లేవనెత్తిన అంశాలకు కేసీఆర్ ఉర్దూలోనే సమాధానమిచ్చారు. ‘‘బీహెచ్‌ఈఎల్ తలపెట్టిన 6 వేల మెగావాట్ల ప్లాంట్‌కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్‌ఈసీ రుణం సమకూరుస్తుంది. ఎన్‌టీసీపీ ప్లాంట్‌కు స్థలాల కొరత లేదు. ఇప్పుడున్న ప్లాంట్‌లోనే 1,600 మెగావాట్ల యూనిట్లు నెలకొల్పుతుంది. మిగతా యూనిట్ల స్థాపనకు గతంలో బీపీఎల్‌కు కేటాయించిన భూములను ఎన్‌టీపీసీకి అప్పగిస్తాం. బీపీఎల్ భూముల స్వాధీన ప్రక్రియ కోర్టులో ఉంది’’ అని వివరించారు.
కేసీఆర్ ఉర్దూ ప్రసంగంపై ఒవైసీ హర్షం
కేసీఆర్ ఉర్దూలో మాట్లాడటంపై అక్బరుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. ఒక తరం తర్వాత శాసనసభలో సీఎం ఉర్దూలో మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు.