
సమగ్ర సర్వేకు సిద్ధం
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది.వారం రోజులుగా ఇదే అంశంపై కసరత్తు చేస్తున్న కలెక్టర్ రొనాల్డ్ రాస్ జిల్లా, మండల అధికారులకు రెండు రోజులుగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్వేకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. సర్వేలో పాల్గొనే అధికారులు, ఎన్యూమరేటర్‌లకు మంగళవారం మండల స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 56 కేంద్రాలలో ఈ శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ప్రభుత్వ సిబ్బందితోపాటు ప్రైవేట్ సిబ్బంది కూడా ఉన్నందున పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.
లోటుపాట్లు లేకుండా
27,635 మంది ప్రభుత్వ ఉద్యోగులు శిక్షణలో పాల్గొననున్నారు. ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు ఆశ వర్కర్లు కలిపి మరో మూడున్నర వేల మంది కూడా శిక్షణ పొందుతారు. వీరికి సోమవారం కలెక్టర్ అనుమతి పత్రాలను జారీ చేశారు. సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులకు ఉపదేశించారు. ప్రతి మండలంలో నాలుగు జోన్‌లు ఏర్పాటు చేసుకొని ఉద్యోగులను ఎన్యూమరేటర్లుగా నియమించుకోనున్నారు. ప్రతి ఇంటికి కరపత్రం, ప్రతి గ్రామానికి పది చొప్పున పోస్టర్లు పంపిణీ చేశారు. మండల ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జిలుగా వ్యవహరించనున్నారు. సర్వే వివరాలను నమోదు చేయడానికి 1200 కంప్యూటర్లను సిద్ధం చేశా రు. అవసరమైన వాహనాలను సమకూరుస్తున్నారు.
జిల్లా జనాభా 25,51,335
జిల్లా జనాభా 25,51,335 కాగా, నివాస గృహాలు 6,68,146 ఉన్నాయి. పట్టణ జనాభా 5,88,372, గ్రామీణ జనాభా19,62,963. ఒక కార్పొరేష న్, మూడు మునిసిపాలిటీలు, 718 గ్రామాలు ఉన్నాయి. ఈ వివరాల న్నింటినీ సర్వేలో సేకరించనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 25 నుంచి 30 ఇళ్లను కేటాయించారు.
సర్వే ఇలా ఉంటుంది
ఎన్యూమరేటర్లకు కుటుంబ సభ్యులు తమ పూర్తి వివరాలు చెప్పాలి. కుటుంబ సభ్యులతో పాటు తాత, ముత్తాతల వివరాలు సేకరించనున్నారు. ఎన్యూమరేటర్ల వద్ద 80 అంశాలతో కూడిన నమూనా ఫారం(25) అందుబాటులో ఉంటుంది. అందులో వివరాలు నమోదు చేస్తారు. ము ఖ్యంగా కులం, భూముల వివరాలు, సొంత ఇళ్లు, రేషన్‌కార్డు, పెన్షన్ వివరాలు తెలియజేయాలి. సర్వేలో గ్రామాధికారులతోపాటు మండలంలోని ప్రతి శాఖ అధికారి, ఎంపీడీఓ, తహశీల్దార్‌సహా సుమారు 18 శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటారు.
ఇవి ఉండాలి
సర్వే రోజు ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు, వంట గ్యాస్ పుస్త కం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఇంటికి సంబంధించిన పత్రాలు, భూముల వివరాలు తెలియజేసే పత్రాలు, ఇళ్ల కొనుగోలు దస్తావేజులు, వాహనపత్రాలు, ఆస్తుల వివరాలు, ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ ఏది అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి.
19న సెలవు
19న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ప్రతి ఒక్కరు ఇంటి వద్దే ఉండాలి. బస్సులు నడవవు. ప్రైవేట్ వాహనాలను అధికారులు తీ సుకుంటారు. దూరప్రాంతా లవారు ఒక రోజు ముందుగానే ఇంటికి చేరుకోవాలి.