సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక : కలెక్టర్ రోస్
కామారెడ్డి : సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా పెన్షన్, ఆహార భద్రతా కార్డుల అర్హులను గుర్తించి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మండల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శు లు అనర్హులకు ప్రభుత్వ పథకాలు చేరకుండా తమ పరి శీలనలో ధ్రువీకరించాలని సూచించారు. ఫామ్ 1 (బీ), ట్రాన్స్‌పోర్ట్, ఆదాయపు పన్ను చెల్లింపుల ఆధారంగా అనర్హులను పక్కాగా గుర్తించాలన్నారు. ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని ప్రత్యేకంగా గుర్తిం చాలన్నారు.
ప్రభుత్వపథకాలకు వేర్వేరుగా గుర్తింపు కార్డులుంటాయని తెలిపారు.అంత్యోదయ అన్నయోజన కింద హెచ్‌ఐవీ, లెప్రసీ, దారిద్య్రంలో ఉన్న మహిళలు, వితంతువులు, భూమిలేని శ్రమజీవులు, రిక్షా నడుపుకునేవారు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు అర్హులన్నారు. వికలాంగులు సదరన్ క్యాంపు ద్వారా పొంది న సర్టిఫికేట్, తహశీల్దార్, ఎంపీడీవో ధ్రువీకరణ తరువాత పెన్షన్ లభిస్తుందన్నారు. ఐకేపీ ద్వారా అల్ట్రాపవర్ సర్వే ప్రతీ మండలంలో నిర్వహించారని, స్వాతం త్య్ర సమరయోధులు, సంచార గృహాల సమాచారాన్ని తప్పకుండా సేకరించాలన్నారు.
పరిశీలన సమయంలో దరఖాస్తులు స్వీకరించవచ్చు
అనంతం ఆర్డీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డివిజన్ లో సర్వేద్వారా భిక్కనూరులో 16,186, దోమకొండలో 17,186, గాంధారిలో 15,320, కామారెడ్డిలో 27 వేలు, లింగంపేటలో 12,817, మాచారెడ్డిలో 15,066, నాగిరెడ్డిపేటలో 9452, సదాశివనగర్‌లో 16,617, తాడ్వాయిలో 13,625, ఎల్లారెడ్డిలో 12,824 దరఖాస్తులు వివిధ ప్రభుత్వ పథకాలకు అందాయని తెలిపారు. వెరిఫికేషన్ సమయంలోనూ దరఖాస్తులను స్వీకరించవచ్చన్నారు. వీఆర్వోలు పహణీ ప్రకారం రైతుల భూమిని చూపించాలని, రెండున్నర ఎకరాల మాగా ణి, ఐదు ఎకరాల మెట్టభూమి, రైస్‌మిల్, షాప్స్ ఇతర ప్రాపర్టీ ఉన్నచో అనర్హుల జాబితాలో చేర్చాలన్నారు.
డివిజన్ ప్రత్యేకాధికారి, ఐకేపీ పీడీ వెంకటేశం మాట్లాడుతూ.. ఆయా మండలాల్లో ఏర్పాటయిన బృందాలు వెరిఫికేషన్ ప్రక్రియను నిరంతరాయంగా పరిశీలించాలన్నారు. ఎండీవో, ఎమ్మార్వోలు, డిప్యూటీ ఎమ్మార్వో లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు సభ్యులుగా బృందాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాలోజీనాయక్, ప్రతేయకాధికారులు, ఎమ్మార్వోలు, వీర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.