
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు చెక్కులు తీసుకున్న రైతులందరూ రైతుబీమాకు అర్హులేనని వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. ఈ పథకం కింద రైతుల నమోదు పురోగతి గురించి శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. పార్థసారథి మాట్లాడుతూ రైతు జీవితబీమా పథకంలో ఇప్పటివరకు 30 లక్షల మంది రైతులపేర్లు నమోదయ్యాయని తెలిపారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాసుబుక్ లేకున్నా రైతుబంధు చెక్కులను అందజేశామని, వారూ రైతుబీమా చేయించుకోవాలని పేర్కొన్నారు.
కొంద రు రైతులు రైతుబంధు చెక్కులు తీసుకోకపోవడంతో అవి తహసీల్దార్ వద్దనే ఉన్నాయని, అలాంటి రైతు లు తప్పనిసరిగా ఆ చెక్కులు తీసుకుని, రైతుబీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు కుటుంబాలకు భరోసా కలిగించడానికే రైతుబీమా పథకమని.. ప్రతీ రైతు కూడా రైతుబీమా పథకంలో నమోదు కావాలని సూచించారు.
పట్టాదారు పాసుపుస్తకం కలిగిన 18 నుంచి 59 సంవత్సరాల (1959 ఆగస్టు 14 నుండి 2000 ఆగస్టు 15 మధ్య పుట్టినవారు) వయసు కలిగిన రైతులు జీవిత బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. జీవితబీమా పథకంలో ప్రతీ పట్టాదారు రైతు నమోదయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జూలై 15, 2018 నాటికి నమోదు వివరాలు అందించాలి కాబట్టి త్వరితగతిన నమోదు, అప్ లోడింగ్ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment