
ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తే పుట్టగతులుండవ్
- వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి హెచ్చరిక
- పథకాల అమలులో సీఎం మ్యాజిక్ చేస్తున్నారని విమర్శ
- వైఎస్ ప్రారంభించిన సాగునీటి పథకాలు నేటికీ పూర్తి కాలేదు
- సచివాలయం తరలింపునకు మేం వ్యతిరేకం
- ప్రజా సమస్యలపై అన్ని పార్టీలతో కలసి పోరాటం చేస్తాం
వనపర్తి/జడ్చర్ల: ప్రాంతీయతత్వంపై గెలుపొందిన టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కనికట్టును ప్రదర్శిస్తున్నారని, ఇలా చేస్తే ఆ పార్టీకి పుట్టగతులుండవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో ఆయన సమక్షంలో పలువురు న్యాయవాదులు, ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా, అంతకు ముందు జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నేతగా ఎన్నో అంచనాలతో ప్రజలు కేసీఆర్‌కు అధికారం కట్టబెట్టారని..అయితే, ఇప్పటివరకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రైతులకు రుణమాఫీతోపాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల అమలులో కేసీఆర్ మ్యాజిక్ చేస్తున్నారని, దీంతో తెలంగాణలో రైతులు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
కృష్ణా పరీవాహక ప్రాంతంలోని నీటిని ఏపీ ప్రభుత్వం ఎక్కువగా వాడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. విద్యుత్ సమస్యతో పం టలు ఎండిపోయి అప్పులు తీర్చలేక రైతు లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు సహాయంగా అందించాలని, నష్టపోయిన పం టలకు ఎకరాకు పత్తి, మిర్చి పంటలకు రూ.25 వేలు, వరికి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సాగుకు కరెంట్ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో వైఎస్ హయాంలో 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు నాలుగు ప్రాజెక్టులు చేపట్టారని ఆయన తెలి పారు. అప్పట్లోనే 75 శాతం పనులు పూర్తయ్యాయని, వైఎస్ మరణం తర్వాత నేటికీ మిగతా పనులు పూర్తికాక పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం అంతా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందని విమర్శించారు.
సచివాలయ మార్పు నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలతో కలసి తమ పార్టీ పోరాటం చేయనుందని తెలిపారు. వైఎస్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల పూర్తిస్థాయి అమలుతోపాటు ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తిచేస్తే బం గారు తెలంగాణ సాధ్యమవుతుందని పొంగులేటి చెప్పారు.
గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం
తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పేద ప్రజల పార్టీగా గుర్తింపు తెచ్చుకుంటుందని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని పొంగులేటి చెప్పారు. ప్రతి ఇంట్లో దివంగత మహానేత రాజశేఖరరెడ్డిని అభిమానించే వారున్నారని.. ఆయన హయాంలో తమకు ఏ పథకం ద్వారా లబ్ధి చేకూరలేదని చెప్పే వారు ఒక్కరూ లేరని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాలో వైఎస్ ప్రారంభించిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ ఖరీఫ్ నాటికి పూర్తి చేసి ప్రజలకు సాగునీరందించాలని.. లేకుంటే వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రైతులతో ఉద్యమాన్ని చేపడతామన్నారు.
వాగ్దానాలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే ప్రజల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని పొంగులేటి చెప్పారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 421 జీవో ప్రకారం సహాయమందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర నేతలు నల్లా సూర్యప్రకాష్, సయ్యద్ ముస్తాక్, భీమయ్య గౌడ్, బంగి లక్ష్మణ్, రాంభూపాల్‌రెడ్డి, జశ్వంత్‌రెడ్డి, భగవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.