
బాధితులంతా 12 ఏళ్ల లోపువారే
మెదక్ జిల్లాలో రైలు ప్రమాదం సంభవించిన మాసాయిపేట చాలా నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో దాదాపు గంటన్నర సేపు ఎవరికీ పిల్లల ఆర్తనాదాలు వినిపించలేదు. పిల్లల్లో చాలామందికి చేతులు విరిగి. కాళ్లు మెలి తిరిగిపోయి పరిస్థితి అంతా హృదయవిదారకంగా ఉంది. బాధితులంతా 5 నుంచి 12 సంవత్సరాల లోపువారేనని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ ఇదే ప్రాంతం మీదుగా బస్సు వెళ్తుందని, కానీ లెవెల్ క్రాసింగ్ వద్ద గేటు మాత్రం ఏర్పాటు చేయట్లేదని ఆయన అన్నారు.
విధులకు ఆలస్యంగా వచ్చిన డ్రైవర్.. తొందరగా వెళ్లాలనే హడావుడిలో రైలు వచ్చేలోగానే ట్రాక్ దాటి వెళ్లిపోవాలనుకున్నాడని, ఈలోపు బస్సు అక్కడ ఇరుక్కుపోయి ఇంజన్ ఆగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మళ్లీ అతడు ఇంజన్ స్టార్ట్ చేసేలోపే రైలు వచ్చి బస్సును ఢీకొందని అన్నారు. అసలు బస్సుతో పాటు వచ్చినది కాకతీయ స్కూలు డ్రైవరేనా లేదా ఎవరైనా ప్రైవేటు డ్రైవర్ వచ్చారా అన్న విషయం కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.