సాక్షి, అమరావతి: ఒడిశాలో ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలోని రాష్ట్ర ప్రయాణికులు ఐదుగురిలో ఒక్కరే మృతిచెందారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి మరణించినట్లు గుర్తించామని.. ఒడిశాలో నివసిస్తున్న ఆయన, పెన్షన్ కోసం వచ్చి, తిరిగి వెళ్తూ కోరమాండల్ ఎక్కినట్లు తేలిందన్నారు.
అతనితోపాటు అదే బోగీలో విశాఖకు చెందిన ఇద్దరు, శ్రీకాకుళానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారని, వీరు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు, రూ.10 లక్షల పరిహారం ఇస్తున్నామని.. గాయపడిన వారి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందన్నారు. తాడేపలిల్లోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
342 మంది రిజర్వ్‌డ్ ప్రయాణికులు సేఫ్
కటక్, బాలాసోర్‌లోని సోరూ, గోపాలపురం ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రయాణికులతో పాటు, ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఊళ్లలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కలుసుకుని మాట్లాడాం. అత్యవసర చికిత్స అవసరమైన వారిని హుటాహుటిన విశాఖకు తరలించడంతో పాటు, భువనేశ్వర్‌లోని అపోలో ఆస్పత్రిలో కూడా చేర్చాం. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి బయల్దేరిన లేదా ఏపీలో దిగాల్సిన వారి వివరాలు సేకరించాం. ఆ రైలు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం 309 మంది తెలుగువారు ఉన్నారు. యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 33 మంది ఉన్నారు.
రెండు రైళ్లలో 342 మంది తెలుగువారు ప్రయాణిస్తున్నట్లు తేలింది. వారిలో 12 మందికి స్వల్ప గాయాలు కాగా, 329 మంది సురక్షితంగా ఉన్నట్లు గుర్తించాం. ఒక్క ప్రయాణికుడు మాత్రం బంధువులతో ఉన్నట్లు తెలిసింది. చికిత్స పొందుతున్న వారిలో తొమ్మిది మందిని విశాఖకు తరలించి కేజీహెచ్‌లో ముగ్గురికి, సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో ఇద్దరికి, క్యూవన్ ఆస్పత్రిలో ఇద్దరికి, అపోలోలో ఒకరికి చికిత్స చేయిస్తుండగా, మరొకరు డిశ్చార్జ్ అయ్యారు.
ఆర్థిక సాయం అందజేత
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆరి్థక సాయానికి సంబంధించిన చెక్కులను మంత్రి అమర్‌నాథ్ సోమవారం అందించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం జగన్ తక్షణ స్పందన
ఇక ఈ ప్రమాదం గురించి తెలియగానే సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించారు. అదే రాత్రి ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే.. మర్నాటి ఉదయమే నాతో పాటు ముగ్గురు ఐఏఎస్‌లు, మరో ముగ్గురు ఐపీఎస్‌లు కలిసి రోడ్డుమార్గం ద్వారా అక్కడకు వెళ్లి వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మాతోపాటు, 27 మంది సపోర్టింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 108 సర్వీసులు 20, మరో 19 ప్రైవేటు అంబులెన్స్‌లు, 15 మహాప్రస్థానం వాహనాలను తీసుకెళ్లాం. రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ వద్ద ఐదు అంబులెన్స్‌లతో సేవలందించాం. ఇంకా సీఎం ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం సరిహద్దులో కొన్ని అంబులెన్సులతో పాటు సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఇప్పటికీ మన రెస్క్యూ బృందాలు భువనేశ్వర్, కటక్, బాలాసోర్‌లో ఉన్నాయి.
కేంద్ర మంత్రుల ప్రశంస..
ప్రమాదం గురించి తెలియగానే మనం శరవేగంగా స్పందించి రాష్ట్రంలో పలుచోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశాం. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర స్టేషన్లలో కంట్రోల్ రూంలకు అందిన సమాచారం ద్వారా ఎక్కడికక్కడ రిజర్వేషన్ల చార్టుల్లో ఉన్న ప్రయాణికుల కాంటాక్టు నంబర్ల ప్రకారం వారితో మాట్లాడి ఆచూకీ తెలుసుకున్నాం. సురక్షితంగా స్వస్థలాలకు చేరేవరకు అందరినీ అప్రమత్తం చేశాం. అక్కడ పరిస్థితుల్ని సమన్వయం చేస్తున్న కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లను కలిసి మన చర్యలను వివరించాం. మన ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా గురించి చెప్పగా కేంద్ర మంత్రులు అభినందించారు.
చదవండి: అమ్మానాన్న క్షమించండి!
Comments
Please login to add a commentAdd a comment