సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న సొరంగ నిర్మాణాల్లో రాతిపొరల కదలికలు గుర్తించడంలో వైఫల్యాలు ఎదురవుతున్నాయి. బ్లాస్టింగ్‌లు జరిగిన అనంతరం రాతిపొరల్లో ఉండే కదలికలను జాగ్రత్తగా గుర్తించాలి. అయితే కాంట్రాక్టు సంస్థలు వినియోగిస్తున్న సెన్సార్లు అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నవి కాకపోవడంతో కదలికల గుర్తింపు సాధ్యం కావడం లేదు. దీంతో బండ (గ్రానైట్)లో ఏర్పడే చిన్నపాటి పగుళ్లలోకి గాలి చొరబడి, గ్రానైట్ పేలుళ్లు జరిగి కాళేశ్వరం ప్యాకేజీ–10లో జరిగినటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ ప్యాకేజీ–10 ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖకు నివేదిక సమర్పించింది. దీన్ని ప్రకృతి వైపరీత్య ప్రమాదంగానే గుర్తిస్తామని పేర్కొన్నా.. కొన్ని కీలకాంశాలను ప్రస్తావిస్తూ సూచనలు చేసింది.
మరింత అప్రమత్తత అవసరం..
కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు వచ్చే నీటిని అప్రోచ్ చానల్, టన్నెల్, పంపింగ్ స్టేషన్‌ల ద్వారా అనంతగిరి రిజర్వాయర్‌కు తరలించేలా ప్యాకేజీ–10ని చేపట్టారు. ఈ పనులను ప్రతిమా ఇన్‌ఫ్రా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీలో మిడ్‌మానేరు ఫోర్‌షోర్‌నుంచి 1.155 కిలోమీటర్ వరకు అప్రోచ్ చానల్, 1.155 కిలోమీటర్ నుంచి 3.535 కిలోమీటర్ వరకు గ్రావిటీ చానల్ నిర్మించిన అనంతరం 11.186 కిలోమీటర్ వరకు 7.651 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 6.68 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తికాగా మిగతా పనులు జరగాల్సి ఉంది. ఈ టన్నెల్ పనులు జరుగుతున్న సమయంలోనే గత సెప్టెంబర్‌లో డ్రాఫ్ట్ ట్యూబ్ పైకప్పులోని ఎయిర్ ప్యాకెట్స్‌లో పేలుడు సంభవించి ఏడుగురు కార్మికులు మృతి చెందారు.
ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఎం.రాజు, సీనియర్ జియోలజిస్ట్ కె.రవీంద్రనాథ్, ఈఎన్‌సీలు నాగేంద్రరావు, అనిల్‌కుమార్‌లతో నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా కమిటీ అనేక విషయాలను తన నివేదికలో పొందుపరుస్తూ పలు సూచనలు చేసింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న సెన్సార్ల కన్నా మరింత మేలు రకం సెన్సార్లు వాడటం ద్వారా రాతిపొరల కదలికలను గుర్తించే అవకాశం ఉంటుందని సూచన చేసింది. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో ఏజెన్సీ వాడిన సెన్సార్‌లు ఎలాంటి కదలికలు గుర్తించలేకపోయాయని తెలిపింది. ఎక్కడైన బ్లాస్టింగ్ అవసరమైన చోట వెంటనే పని మొదలు పెట్టకుండా, అక్కడి నుంచి విడి మెటీరియల్‌ను పూర్తిగా తొలగించిన అనంతరం, పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన తరువాతే పనులు చేయాలని పేర్కొంది. ఇదే సమయంలో రాక్ సపోర్ట్ సిస్టమ్‌ను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని కమిటీ సూచనలు చేసింది.a
సెన్సార్లకు అందని రాతిపొరల కదలిక!
Published Wed, Nov 22 2017 4:16 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment