
అమిత్ షా పర్యటన ఖరారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించనున్నారు. గత ఆగస్టులో రెండురోజుల పాటు హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన మళ్లీ ఈ దఫాకూడా రెండురోజుల పర్యటనకు వస్తున్నారు.
27న ఆయన పార్టీ ఉప మండల్ ప్రముఖులు, సభ్యత్వ నమోదు బాధ్యత ఉన్న ప్రముఖులతో వరంగల్‌లో భేటీ కానున్నారు. అనంతరం 28న హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడం లక్ష్యంగా కార్యాచరణపై ప్రసంగిస్తారని పార్టీవర్గాల సమాచారం.
ఆగస్టు పర్యటన సందర్భంగా ఆయన పార్టీనేతలకు ప్రత్యేక సూచనలు చేశారు. వాటి అమలు తీరును ఆయన ఈ సందర్భంగా సమీక్షించే అవకాశం ఉంది. తెలంగాణలో పార్టీ బలపడాలంటే సభ్యత్వ నమోదు కీలకం కావడంతో ఈ పర్యటనలో దృష్టి దానిపైనే కేంద్రకరించే అవకాశం ఉందని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.