తెలంగాణ కమలనాథుల తీరు మారడం లేదా?. ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా?. పార్టీ పెద్దలు వచ్చినప్పుడే కలిసికట్టుగా కనిపిస్తున్నారా?. బీజేపీ సమన్వయలేమి సమస్యను అధిగమించడం కష్టమేనా?. తెలంగాణ కాషాయదళంలో ఏం జరుగుతోంది?. అధిష్టానానికి అందిన రిపోర్ట్‌లో ఏముంది..
తెలంగాణ కాషాయ పార్టీ పార్లమెంట్ ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్ర పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ బీజేపీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నేతల మధ్య సమన్వయలోపం. దీనిపై పార్టీ అగ్రనేతలు చాలా సీరియస్‌గా ఉన్నారు. పార్టీలో గ్రూపులుగా విడిపోయి.. ఆధిపత్య పోరుకు దిగడంపై స్వయంగా అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరికి అమిత్ షా.. స్పెషల్ క్లాస్ తీసుకున్నా తీరు మాత్రం మారలేదు. సోషల్ మీడియాతో ఇద్దరు నేతల మధ్య వార్ ముదిరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరి నేతల మధ్య విబేధాలు.. రాష్ట్ర పార్టీకి డిస్ట్రబెన్స్‌గా మారాయి. ఇక పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో జాతీయ నేత మురళీధర్ రావు పార్టీ కార్యక్రమాలకు వచ్చామా? వెళ్లిపోయామా? అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాష్ట్ర నేతల మధ్య ఐక్యత అన్నది కనిపించడంలేదు. నిత్య విరోధులుగా కనిపించే కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పనిచేసి అధికారం సాధించారు. బీజేపీలో మాత్రం నేతలు కలిసిపోయే పరిస్థితులు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి దాటి బయటకు వెళ్లరనే టాక్ ఉంది. అసంతృప్తితో రగిలిపోతున్న నేతలను పిలిచి మాట్లాడే నాయకత్వమే కరువైందని చాలా మంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ సీనియర్ నేత, ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన డాక్టర్ లక్ష్మణ్.. కేవలం ప్రెస్‌మీట్ల వరకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. పార్టీ సమావేశాల్లో ఒకే వేదికపై కనిపించే నేతలు.. అంతర్గతంగా మళ్లీ చర్చించుకున్న దాఖలాలే లేవు. రాష్ట్ర నేతలందరూ కలిసి కట్టుగా ఒక్కోసారి ఒక్కోనేత ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ మీట్.. లంచ్ మీట్.. డిన్నర్ మీట్ ఏర్పాటు చేసుకోవాలని అమిత్ షా చాలా సందర్భాల్లో సూచించినా తెలంగాణ కమలం నేతలు ఏనాడు అమలు చేయలేదు. సమన్వయలేమి సమస్యకు చాలా సందర్భాల్లో పార్టీ హైకమాండ్ పరిష్కార మార్గాలు చూపినా రాష్ట్ర నేతలు మాత్రం లైట్ తీసుకున్నారు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఏనాడు పార్టీ వ్యవహరాల్లో ఇన్వాల్వ్ కాలేదు. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మధ్య అంతర్గతపోరు ఇంకా ఆగలేదు. కొత్తగా చేరిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవడంలో బీజేపీ విఫలమవుతోంది. అగ్రనేతలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ నేతలంతా కలిసికట్టుగా ఉన్నట్లు నటిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇదంతా గమనిస్తున్న పార్టీ హైకమాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో నేతల మధ్య సమన్వయానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment