సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరికలపై కసరత్తు ముమ్మ రంగా సాగుతోంది. తాజాగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీమంత్రి బాగారెడ్డి కుమారుడు, మెదక్ డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, రంగారెడ్డి డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణకు ముందే వీరంతా ఆయనతో సమావేశమైనట్టు తెలిసింది.
ఈ నేతలే డీకే అరుణతోనూ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈనెల 29న కేంద్రమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన సమక్షంలోనే వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఒకవేళ అది కుదరకపోతే ఢిల్లీ వెళ్లి అమిత్‌షా లేదా జేపీ నడ్డాల సమక్షంలో పార్టీలో చేరొచ్చు. రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల కూడా వివిధ ఉమ్మడి జిల్లాల్లోని అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకునే విషయంలో సంప్రదింపులు ముమ్మరం చేసినట్టు ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీపరంగా సంసిద్ధం కావడంలో భాగంగా దాదాపు ఇరవై కమిటీలను నియమించనున్నట్టు సమాచారం.
ప్రముఖులతో అమిత్‌షా భేటీ..
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 29న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన ఏర్పాట్లను కిషన్ రెడ్డి సమీక్షించారు. మంగళవారం రాత్రి బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో జరిపిన సమీక్షలో అమిత్ షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చర్చించారు. తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, వివిధ రంగాల ప్రముఖులతో అమిత్ షా భేటీ అయ్యేలా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంతో పాటుగా పార్టీ రాష్ట్ర శాఖ పదాధికారులు, తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతోనూ అమిత్ షా భేటీ కానున్నారు. ఈ సమావేశం సందర్భంగా.. తెలంగాణలో పార్టీని అధికారంలోని తీసుకొచ్చే విషయంలో పార్టీ కేడర్‌కు షా దిశానిర్దేశం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్ మాట్లాడితే.. వైఎస్సార్ ఫొటో చూపించండి
Comments
Please login to add a commentAdd a comment