‘ప్రస్తుత పరిస్థితుల పట్ల అనవసర భయాలు, ఆందోళనలు వద్దు. ఇప్పుడు మనం ఎదుర్కొంటోంది కొత్త సమస్య. ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ప్రస్తుతమున్న సమస్యలు ప్రపంచమంతా ఉన్నాయి. అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భవిష్యత్‌లో ఏదో పెద్ద నష్టం జరుగుతుందని ముందే ఊహించుకుని ఆందోళనలకు, మానసిక కుంగుబాటుకు లోనుకాకుండా వాస్తవాన్ని గ్రహించి ఏమి జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. ప్రస్తుత లాక్‌డౌన్ పీరియడ్‌ను అనుకూలంగా మార్చుకుని, ఫలితాలు సాధించాలి‘ అని మానసిక శాస్త్ర నిపుణులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, విశ్లేషకులు సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ పొడిగింపు వంటి పరిణామాల నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులు యండమూరి వీరేంద్రనాథ్, డా.బీవీ పట్టాభిరాం, ప్రొ.వీరేందర్, డా.నిశాంత్ వేమనలతో ’సాక్షి‘ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించింది. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే..
–సాక్షి, హైదరాబాద్
మళ్లీ ఇలాంటి దశ రాదు
‘‘నీతో పాటు నువ్వు ఏకాంతంగా ఓ 15 రోజులు ఉండలేవా? ఒంటరితనం వేరు. ఏకాంతం వేరు. మనకు ఎవరూ లేరు అనుకోవటం ఒంటరితనం. ప్రకృతి, వెన్నెల, ప్రత్యూషం అన్నిటినీ ప్రేమిస్తూ ’నాకు నేనున్నా’అనుకోవటం ఏకాంతం.. ఎన్నో పనులు చేయొచ్చు. గూగుల్లో ’కోరా’ఓపెన్ చేస్తే బోలెడంత జ్ఞానం, టైంపాస్ టీవీకి కరెంటు లేదని, స్నానానికి వేడి నీరు, నిద్రకు ఫ్యాను, మూడు పూటలా చిరుతిండి లేవని సణుగుతున్న పిల్లలకు.. దివిసీమ ఉప్పెన, కేరళ సునామీ, జపాన్ అగ్నిపర్వతం గురించి చెప్పు.
’కరోనా’కాకుండా భూకంపం వచ్చి ఉంటే ఎలా ఉండేదో, యుద్ధం అంటే ఏంటో పెద్ద గీత పక్కన ఇంకా పెద్ద గీసి చూపించు. ఇరాన్, ఇరాక్, సిరియా, ఇథియోపియా వీడియోలు (మరీ చిన్న పిల్లలకి కాదు) శిథిలమైన ఇళ్లు, రక్తసిక్తమైన శరీరాలు, సగం చచ్చి బ్రతుకుతున్న పిల్లలు, అస్థిపంజరమైన బాల్యం.. ఇవన్నీ చూపిస్తూ మనం ఎంత అదృష్టవంతులమో వివరించు. ధైర్యం చెప్పు. వెండి స్పూన్‌తో భోజనం పెట్టు. కానీ అసలు భోజనం లేనివాళ్లు కూడా ఉన్నారని తెలియజెయ్యి. ఈ పాతిక రోజుల సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకో. వ్యాయామం, కొత్త పుస్తకాలు, పజిల్స్, బుక్స్ చదివి పిల్లలతో చర్చించటం.. మొదలైన పనులు చేపడితే పాతిక రోజులు పాతిక క్షణాల్లా గడిచిపోతాయి. ఆలోచించు. మళ్లీ నీ జీవితంలో ఇలాంటి దశ రాదు. పాజిటివ్‌గా ఉండు. (సినికల్ ఫీలింగ్ నుంచి బయటపడటానికి మాత్రమే)’’.
– ప్రముఖ రచయిత, వ్యక్తిత్వవికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్
‘అమ్మ’పై భారం పెంచకండి
‘‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో మునుపెన్నడూ లేని పరిస్థితులను వివి ధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ జనాభా అంతా కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. ఆందోళనలు, భయాలతో భవిష్యత్ గురించి అనవసరంగా ఎక్కువగా ఆలోచించొద్దు. లాక్‌డౌన్ మొదటి వారం రోజులు ఎక్సైట్‌మెంట్, 15 రోజులు ఎంటర్‌టైన్‌మెంట్, 20 రోజులకు బోరడమ్.. ఇది స్థితిమంతులు, ఎగువ మధ్యతరగతికి చెందిన అత్యధికుల ఫీలింగ్. అదే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఇతర వర్గాల్లో వారం నుంచే ఆందోళన, ఆ తర్వాత డబ్బులు, జీవితం, అప్పులు, ఉద్యోగం ఎలా అనే భయాలు ఏర్పడ్డాయి. ఇదంతా సహజమే. పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో తెలియక పేరెంట్స్‌కు పెద్ద సవాలుగా ఈ పీరియడ్ మారింది.
ఎక్కువగా మొబైల్స్, ఇతర సాధనాల్లో మునిగి తేలుతున్నందున లాక్‌డౌన్ తర్వాత పిల్లల్లో పూర్తిగా భిన్నమైన దృక్పథాలు ఏర్పడే అవకాశాలున్నాయి. భార్యాభర్తల మధ్య కోపతా పాలు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. అందరూ ఇళ్లలోనే ఉండటంతో ఇంట్లో అన్ని బాధ్యతలు చూసే అమ్మపై మరిన్ని భారాలు పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్ర స్తుతం ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనువైన చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. పిల్లల ఫీజులు, అప్పులు, ఇళ్ల అద్దెలు తదితర అంశాల్లో ఆర్థిక వెసులుబాటు కలిగించే విషయం పై ఆలోచిస్తున్నాయి. అందువల్ల అనవసర ఆందోళనలు పెట్టుకోకుండా, ఆశావహ దృక్పథంతో వ్యవహరిస్తే ఎలాంటి సమస్యలుండవు’’
– జేఎన్‌టీయూ–హెచ్ కన్సల్టెంట్ సైకాలజిస్ట్ డా.సి.వీరేందర్
దీనిని సవాల్‌గా తీసుకోవాలి
‘‘కరోనా పరిణామాలపై అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది నిజమైన మానసిక కుంగుబాటు కాదు. సముద్రంలో సుడిగుండం ఏర్పడటం డిప్రెషన్. ఉద్యోగం పోవడం డిప్రెషన్. ప్రస్తుతం మనందరం కూడా ఇబ్బందుల్లో ఉన్నామనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. దీన్ని ఒక సవాలుగా స్వీకరించాలి. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. ప్రపంచమంతా ఇవే పరిస్థితులను ఎదుర్కొంటోందన్న నిశ్చితాభిప్రాయానికి రావాలి. సీయూఆర్‌ఈ(క్యూర్)–కాన్ఫిడెన్స్, అండర్‌స్టాండింగ్, రిలాక్సేషన్. ఎఫెక్టివ్ సెల్ఫ్ టాక్ ఇప్పుడు ఉపయోగపడతాయి.
ఇంట్లో వాళ్లందరితో స్నేహంగా.. ఆత్మీయంగా ఇంత సుదీర్ఘకాలం గడిపే అవకాశం మళ్లీ రాదనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. ఇంటిపెద్దలు పెద్దరికం ప్రదర్శించడానికి బదులు ప్రేమ, వాత్సల్యం చూపడంతో పాటు ఇతర కుటుంబసభ్యులతో స్నేహ భావంతో మెలగాలి. రోజంతా చురుకుగా ఉంటూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏదో ఒక అభిరుచిని అలవాటు చేసుకోవాలి. పదేపదే టీవీలో కరోనా వార్తలు చూసి ఆందోళనకు గురికాకుండా పొద్దున దినపత్రిక ఒకసారి, రాత్రి టీవీ ఒకసారి చూసి దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుని అంతవరకే పరిమితమైతే సరిపోతుంది. రోజుకు కనీసం ముగ్గురు పాత స్నేహితులను ఫోన్లో పలకరించి పాత సంగతులను నెమరువేసుకోండి. మంచి విషయాలపై దృష్టి సారించండి. ప్రస్తుత సమయాన్ని ఆందోళన లేకుండా ఉండేందుకు 5 ‘టీ’లు– టైం, టాక్, టీచ్, ట్రస్ట్, ట్రీట్ పాటించండి ’’.
– ప్రముఖ సైకాలజిస్ట్, మెజీషియన్ డా.బీవీ పట్టాభిరాం
బుర్రలు బద్దలు కొట్టుకోవద్దు
‘‘మన ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లి వస్తే వారికి వైరస్ సోకి ఉంటే మనకూ అది వ్యాపిస్తుందా అన్న భయాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితులే ఇంకా ఎంత కాలం కొనసాగుతాయో వాటి ప్రభావం మన జీతాల మీద, జీవితం మీద ఏ మేరకు పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే మన పరిధిలో పరిష్కరించగలిగే అంశాల గురించే మనం ఆలోచిస్తే మంచిది. ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలు మొత్తం ప్రపంచమంతా ఉన్నందున అనవసరంగా ఆందోళన చెందొద్దు.
ఇలాంటి విపత్కర పరిస్ధితులను మన తాతలు, తండ్రులు చూడలేదు, ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు కాబట్టి ఏం జరగబోతోందని అతిగా ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్ గురించి, సమస్యల పరిష్కారానికి ఏమి చేయాలన్న దానిపై ప్రధానమంత్రి, రాష్ట్రాల సీఎంలు ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఉన్నాం కదా అని రోజువారీ ప్రణాళిక తప్పకూడదు. యువత, పిల్లలు నెట్ అడిక్షన్‌కు గురికాకుండా కొంత సమయం కేటాయించి పరిమితంగా మాత్రమే సెల్‌ఫోన్, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి వాటిని ఉపయోగించాలి. కొత్త విషయాలను తెలుసుకునేందుకు, కొత్త అభిరుచులను పెంచుకునేందుకు ప్రయత్నించాలి’’.
– కన్సల్టెంట్ సైక్రియాట్రిస్ట్ డా.నిషాంత్ వేమన
Comments
Please login to add a commentAdd a comment