
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య విభజన వివాదాల పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశమై చర్చలు జరపనున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు సత్వర ముగింపు పలికేందుకు ముఖ్యమంత్రులిద్దరూ ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న ఈ సమావేశానికి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వేదిక కానుంది. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలతో పాటు విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు, రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు పరస్పరం చెల్లించుకోవాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు, పౌర సరఫరాల శాఖ విభజన తదితర అంశాలను ఈ సమావేశ ఏజెండాలో చేర్చినట్లు తెలిసింది.
ఈ సమస్యల పరిష్కారం దిశగా సీఎంలిద్దరూ సానుకూల దృక్పథంతో చర్చలు జరిపి పలు విషయాల్లో ఉమ్మడిగా ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశముంది. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో భాగంగా వివాదాల పరిష్కారానికి ఇద్దరు సీఎంలూ చొరవ చూపుతుండటంతో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమావేశంలో వచ్చిన ఫలితం ఆధారంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషి, ఎల్వీ సుబ్రమణ్యం వచ్చే నెల 3న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో భేటీ అయి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment