స్నేహంతో సాధిస్తాం | KCR Says Friendly And Cordial Relationship With Andhra Pradesh | Sakshi
Sakshi News home page

స్నేహంతో సాధిస్తాం

Published Wed, Jun 19 2019 3:21 AM | Last Updated on Wed, Jun 19 2019 5:44 AM

KCR Says Friendly And Cordial Relationship With Andhra Pradesh - Sakshi

మంగళవారం ప్రగతిభవన్‌లో కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న సీఎం కేసీఆర్‌.  చిత్రంలో విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, హోం మంత్రి మహమూద్‌ అలీ

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌తో స్నేహపూర్వక, ఉల్లాసభరిత సంబంధాన్ని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలు, తద్వారా రాబట్టాల్సిన ఫలితాలపై మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విస్తృతంగా చర్చించిందన్నారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రతి అంగుళానికీ సాగునీరు తీసుకెళ్లాలనే నిర్ణయానికి ఇద్దరు ముఖ్యమంత్రులం వచ్చాం. దాని ఫలితాలను రాబోయే రెండు మూడేళ్లలో ప్రజలకు చూపెడతాం. ఇవేకాదు.. రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలుంటాయి. విభజన అంశాలు, రవాణా ఒప్పందాలు, పోలీసు బలగాల వినియోగం, శాంతిభద్రతలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పరస్పర సహకారం లాంటి అంశాలుంటాయి. ఇరుగు పొరుగున ఉంటున్న వారు మంచిగా ఉంటేనే చక్కగా ఉంటుంది. అందుకే గతంలో ఎప్పుడూ చూడని మంచి ఫలితాలు రావాలని, తెలుగు ప్రజలకు శుభం కలగాలని అంటున్నా. ఇదే ఉత్తమమైన మార్గం. దీన్ని పాటించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ బంధం కొనసాగుతుందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెబుతున్నాం’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.  మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 

గతంలో పంచాయితీలు.. నేడు సత్సంబంధాలు... 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మార్పు తదనంతర పరిణామాల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులం వివిధ సందర్భాల్లో కలిశాం. మా కలయిక సందర్భంగా జరిగిన చర్చల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఆ రాష్ట్రానికి చెందిన కార్యాలయాలను తెలంగాణకు అప్పగించింది. దీంతో మంచి వాతావరణం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు కర్ణాటక, మహారాష్ట్రతోనూ బస్తీమే సవాల్‌ అనే రీతిలో పంచాయితీలుండేవి. ఎడతెగని, అంతులేని వివాదాలు, కోర్టు వ్యాజ్యాలుండేవి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వ చొరవతో కర్ణాటకతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. గతంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సందర్భం నుంచి మూడు సార్లు నీటిని ఇచ్చిపుచ్చుకునే స్థాయికి వచ్చాయి. మొదట వాళ్లు.. ఆ తర్వాత ఆర్‌డీసీ ద్వారా మేము.. మళ్లీ ఇటీవల మూడో పర్యాయం జూరాలకు 3 టీఎంసీలు ఇచ్చారు. అందులో 0.6 టీఎంసీలు వచ్చాయి. ఇది మంచి పరిణామం. కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు ఐదు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. అది కాంగ్రెస్‌ నాయకులకు ఎన్నికల నినాదం. కానీ ఈ రోజున చనాటా–కొరాటా రూపంలో చకచకా నిర్మాణమవుతోంది. త్వరలోనే పూర్తవుతుంది కూడా. 

ప్రపంచం అబ్బుర పడేలా కాళేశ్వరం... 
ప్రపంచమే అబ్బురపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును చకచకా నిర్మించాం. కొన్ని పనులు 50 శాతం పూర్తయ్యాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇంత వేగంగా ప్రాజెక్టు నిర్మాణం జరగడానికి మహారాష్ట్ర ఇచ్చిన తోడ్పాటు, సహకారమే కారణం. వాళ్లు ఎంతగా తోడ్పాటు అందించారంటే ప్రాజెక్టులో భాగంగా కరకట్ట నిర్మాణం కోసం 15 ఎకరాల ప్రైవేటు భూమి, 25 ఎకరాల అటవీభూమిని ఉదారంగా ఇప్పించారు. పర్యావరణ అనుమతులు కూడా ఇప్పించారు. ఇది స్నేహపూరితంగా ఉండటం వల్లే సాధ్యమైంది. శత్రుభావంతో ఉంటే ప్రాజెక్టును ఆపడానికి అదొక్క పాయింటు చాలు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కింద 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండుతాయి. ఫేజ్‌–1 కింద గతంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు పూర్తిగా... సిరిసిల్ల, హుస్నాబాద్‌ ప్రాంతాల్లోని మరో 5 లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఫేజ్‌–2లో మరో 20 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు సమృద్ధిగా నీటిని అందిస్తుంది. ఇంత వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తి కావడం అందరినీ ఆశ్చర్యపోయే సందర్భం. 

దుష్ట పన్నాగాలను దాటుకొని వెళ్లాం... 
కొన్న దుష్టశక్తులు దుష్ట పన్నాగాలు పన్నినా.. ధైర్యంగా ముందుకు వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేశాం. ఈ నెల దాటితే శుభ ముహూర్తం లేదనే ఉద్దేశంతో ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఈ విషయంలో కొందరు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. వాళ్లకు జిమ్మేదార్‌ తనం లేదు. బయట కూర్చున్న వాళ్లు ఎన్నైనా మాట్లాడొచ్చు. రాష్ట్రంలో 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు విషయంలో విమర్శలు చేసే వాళ్లకు జ్ఞానం ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న వారికి మరీ ఇంత అసహనం పనికిరాదు. ప్రజలకు ఎప్పుడు, ఎవరికి అధికారం ఇవ్వాలో తెలుసు. టీఆర్‌ఎస్‌ను ఐదేళ్లు సుభిక్షింగా పాలించమని మూడింట రెండొంతల మెజారిటీని ప్రజలు కట్టబెట్టారు. ఒక రాష్ట్ర సీఎంను ఆహ్వానించేందుకు వెళ్తే రావొద్దంటూ లేఖలు రాయడం సంస్కారం అనిపించుకోదు. మీకు 50 ఏళ్లు అధికారం ఇచ్చినా ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు. భారతదేశంలో 45 లక్షల ఎకరాలకు సాగునీరు.. 80 శాతం తెలంగాణకు తాగునీరు.. 85 శాతం పారిశ్రామిక అవసరాలకు నీరు అందించే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసి, వక్రభాష్యాలు చెప్పి 200కుపైగా కోర్టు కేసులు వేశారు. విమర్శలు చేసేవాళ్లు ఇప్పుడు చేసేదేమీ లేదు. అసహాయ స్థితిలో చేస్తున్న విమర్శలు పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. 

కాళేశ్వరం ప్రారంభోత్సవం ఇలా.. 
గవర్నర్‌ నరసింహన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుంది. నేనే ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నా. ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్య అతిథులుగా వస్తున్నారు. వారితోపాటు ఆయా రాష్ట్రాల మంత్రులూ వస్తున్నారు. స్థానికుడైన మంత్రి ఈటల రాజేందర్‌ పూజలు నిర్వహిస్తారు. మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాంతాల వద్ద ఏర్పాట్లను సమన్వయపరుస్తారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, ఐదు పంపింగ్‌ స్టేషన్‌ల వద్ద ఏర్పాట్లను మరో ఐదుగురు మంత్రులు పర్యవేక్షిస్తారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయానికి వారు అక్కడ టెంకాయ కొట్టి పూజలు చేస్తారు. ప్రధానమైన బ్యారేజీ మేడిగడ్డ వద్ద నేనే పూజ చేస్తాను. హోమం కూడా నిర్వహిస్తున్నాం. గతంలో శంకుస్థాపన అక్కడే చేశాం. కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద కూడా పూజ చేసి గ్రావిటీ కెనాల్‌కు నీళ్లు ఎత్తిపోసే విధంగా స్విచ్‌ ఆన్‌ చేస్తాం. మధ్యాహ్న భోజనం అనంతరం అతిథులను సత్కరించి వారికి వీడ్కోలు పలుకుతాం. ప్రాజెక్టు ఫొటో గ్యాలరీ పరిశీలన, పండితులు చెప్పినట్లు పూజలు, ఇతర కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తాం. ఇది చాలా సంతోషం. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నం. 

ఐదు హెలికాప్టర్లు.. ఆరు హెలిప్యాడ్లు... 
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి గవర్నర్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ సీఎంలు వస్తున్నందున ఆరు హెలిప్యాడ్లు సిద్ధం చేశాం. ఏపీ సీఎం జగన్‌ ఆ రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్‌లో వస్తుండగా గవర్నర్, మహారాష్ట్ర సీఎంతో పాటు బ్యాంకు కన్సార్షియం అధికారులను తీసుకెళ్లేందుకు మరో నాలుగు హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నాం. ఒక్కో హెలికాప్టర్‌ అవసరాన్నిబట్టి ఎన్నిసార్లయినా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశాం. ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగే చోట విశాలమైన స్థలం లేకపోవడంతో బహిరంగ సభ నిర్వహించడం లేదు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర కూడలి పూర్తిగా అడవితో ఉండటం, వర్షం పడితే తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీడియాకు కూడా ఆహ్వానం పంపడం లేదు. 

కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు... 
ఇంత తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం ప్రభుత్వ ఘనతగా భావిస్తున్నాం. ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోపాటు బ్యాంకుల కన్సార్షియం, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా నిధులు సేకరించాం. ఎన్నో సవాళ్లను అధిగమించి బ్యాంకుల కన్సార్షియాన్ని ఒప్పించి రుణం పొందాం. వాళ్లు ఇచ్చిన రుణం వినియోగించిన తీరును చూపించేందుకు ఈ నెల 20వ తేదీనే కన్సార్షియం అధికారులు చేరుకునేలా ఏర్పాట్లు చేశాం. బహుముఖంగా చేసిన పనులతో రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేశాం. ఇందులో 400 కేవీ సబ్‌స్టేషన్లు ఉండటం అందుకు ఉదాహరణ. రాష్ట్రంలో ఇప్పటికే మిషన్‌ భగీరథ ద్వారా బిందెల ప్రదర్శన లేకుండా చూశాం. నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చాం. జూలై నెలాఖరుకు మిషన్‌ భగీరథ పూర్తి చేస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా దేవాదుల, సీతారామ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేసి ప్రారంభిస్తాం. కృష్ణా నదిపై పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల కోసం బ్యాంకుల కన్సార్షియం రూ. 10 వేల కోట్ల రుణం ఇచ్చింది. మొత్తంగా ఏడాదిన్నరలోగా రాష్ట్రంలో సాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. 

సాగు నీరు ఇవ్వాలనే పట్టుదలతో ఏపీ సీఎం జగన్‌... 
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని స్వయంగా మహారాష్ట్ర, విజయవాడలకు వెళ్లి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించా. ఇద్దరూ వచ్చేందుకు అంగీకరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒప్పందం చేసుకొని కొన్ని రోజులే అయింది కదా... అప్పుడే ప్రాజెక్టు పూర్తి చేశారా అంటూ అభినందించారు కూడా. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఖ్యమంత్రి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంద్ర, కోస్తా, రాయలసీమలోని మెట్ట ప్రాంతాలకు నీరివ్వాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని, బేషజాలు పనికి రావనే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకోసం ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాగునీటిశాఖ అధికారులు ఇక్కడకు వస్తున్నారు. ఒకట్రెండు రోజులపాటు ఇక్కడ చర్చలు జరుపుతారు. రెండో సమావేశం విజయవాడలో ఉంటుంది. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలనకు సంయుక్త బృందాలు కూడా వెళ్తాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం.  

ఇరు రాష్ట్రాలు 4,800 టీఎంసీలు వాడుకోవచ్చు... 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమైనా... ఏపీ, తెలంగాణ అయినా రెండు రాష్ట్రాలకు కలిపి 1,480 టీఎంసీల గోదావరి నీరు వినియోగించుకోవచ్చు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం 811 టీఎంసీల కృష్ణా నీటిని కూడా వినియోగించుకోవచ్చు. రెండూ కలిపి రమారమి 2,300 టీఎంసీల నీరుంది. ఇక తెలుగు రాష్ట్రాల తర్వాత బంగాళాఖాతమే కాబట్టి మిగులు జలాలు మీరే వాడుకోవచ్చని ట్రిబ్యునల్‌ చెప్పింది. 50 ఏళ్ల కేంద్ర జలవనరుల సంఘం రికార్డులను పరిశీలిస్తే 3,500 టీఎంసీల పైచిలుకు నీరు సముద్రంలోకి వెళ్తోంది. ఒక్కో ఏడాది అది 5–6 వేల టీఎంసీలు కూడా ఉంది. చిన్నచిన్నవి కలిపి మరో 500 టీఎంసీలు కూడా ఉంటాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు సరాసరి 1,200 టీఎంసీల నీరు వస్తుంది. అంటే దాదాపు 4,700 నుంచి 4,800 టీఎంసీల నీరు రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చు. పొరపొచ్చాలు, అపార్థాలు, అవసరంలేని కయ్యాలు, కీచులాటల వల్ల ఈ నీటిని వాడుకోకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు నష్టపోయారు. అందుకే కేంద్రం వద్దకు వెళ్లి పరిష్కారం చేసుకోవాల్సిన దుర్గతి కూడా వద్దనుకున్నాం. ఇదే ఉత్తమ మార్గమని మా కేబినెట్‌ కూడా నిర్ణయానికి వచ్చింది. 

ఐయాం ది అచీవర్‌..! 
ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలమునకలుగా ఉండటం వల్లే నేను హాజరు కాలేకపోతున్నా. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్నాం. గతంలో మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధానిని పిలిచాం. కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని నేనే సంతృప్తిగా చేద్దామనుకుంటున్నా. ఐయాం ది అచీవర్‌. ప్రధానిని ఆహ్వానించేందుకు ఒక సమయం, సందర్భం ఉంటుంది. కొందరు సిల్లీ వ్యక్తులు ఏవేవో ఊహించుకొని విమర్శలు చేస్తున్నారు. మేం రాజకీయంగా ఉండాల్సినంత బలంగా ఉన్నాం. అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం చాలా రికార్డులు బ్రేక్‌ చేస్తున్నాం. ఇవన్నీ చాలా మందికి నచ్చవు. మాకు ఎవరితోనూ పంచాయితీ లేదు. మేం ఎన్డీయేలో భాగస్వాములను కాదని ప్రపంచమంతా తెలుసు. నేను ప్రమోట్‌ చేసిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నా. కేంద్రంతో రాజ్యాంగపరమైన సంబంధాలు కొనసాగిస్తాం. కేంద్రంలో మోదీకి, రాష్ట్రంలో మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. మేం చేయాల్సింది మేము.. వారు చేయాల్సింది వారు చేస్తారు. దీనికి లేనిపోని కథలు అల్లొద్దు. 

కేంద్రానికి అంశాలవారీ మద్దతు... 
మోదీ ప్రధాని అయిన తర్వాత గతంలో అతికఠినంగా విమర్శించింది నేనే.. సీలేరు పవర్‌ప్లాంటుతోపాటు ఏడు మండలాలు లాక్కోవడంపై ప్రధానిని ‘ఫాసిస్ట్‌’అని విమర్శించా. అయితే కేంద్రానికి అంశాలవారీగా మద్దతు ఇచ్చాం. మాకు నచ్చని చోట వ్యతిరేకించాం. ఇప్పుడు అలాంటి సంబంధమే కొనసాగిస్తాం. కేంద్రం నుంచి గత ఐదేళ్లలో మాకు రూపాయి రాలేదు. నిధుల విషయంలో గతంలో అమిత్‌ షాను ‘ఆపరేషన్‌ బ్లూస్టార్‌’చేసింది నేనే. మాకు కేంద్రం నుంచి నిధులు రాలేదనే అంశంలో కాగ్‌ నివేదిక చూస్తే విషయాలు తెలుస్తాయి. గతంలో మిషన్‌ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలంటే 24 రూపాయలు కూడా ఇవ్వలేదు. బీఆర్‌జీఎఫ్‌ గ్రాంటు కింద రూ. 450 కోట్లు నాలుగేళ్లు ఇచ్చి చివరి ఏడాది ఎగ్గొట్టారు. కేంద్రం నుంచి సాయం లేకున్నా రుణమాఫీ చేస్తాం. నిధుల కోసం ఆర్జీలు ఇస్తాం. లేకున్నా ముందుకు సాగుతాం. ప్రాజెక్టుల అనుమతి విషయంలో కేంద్రం మాకు మెహర్బానీ ఏం చేయలేదు. 

నదీజలాల పంపకంపై ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు... 
నదీ జలాల పంపకానికి సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన బ్రజేష్‌ ట్రిబ్యునల్‌ 2004 నుంచి ఇప్పటివరకు 15 ఏళ్లుగా తీర్పు ఇవ్వలేదు. ఇలా అయితే అనుమతులు ఎప్పుడు వస్తాయి. ప్రాజెక్టులు ఎప్పుడు కట్టాలి. ఇదే అంశాన్ని ఏపీ సీఎం జగన్‌కు చెప్పా. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరంగానీ, గవర్నర్‌ మధ్యవర్తిత్వంగానీ అవసరం లేదు. ఐదు నిమిషాలు కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ట్రిబ్యునల్, కోర్టుల తీర్పుతో సంబంధం లేకుండా రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లిస్తే ప్రజలు స్వాగతిస్తారు. ప్రాజెక్టుల అనుమతి విషయంలో మేము కష్టపడి, తెలివిగా అనుమతులు తెచ్చుకున్నాం. తెలంగాణ ప్రాజక్టుల నిర్మాణంలో అహోరాత్రాలు శ్రమించా. ఇప్పుడు అదే రీతిలో కష్టపడతాం. ఎత్తిపోతల పథకాలతో ప్రయోజనం లేదని భావించే వాళ్లు అందులో దూకి చావాలి. 

త్వరలో పీఆర్‌సీ, వయోపరిమితి పెంపుపై నిర్ణయం... 
పీఆర్‌సీతోపాటు ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. రాబోయే కొద్దిరోజుల్లో ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. 61 ఏళ్ల వరకు ఉద్యోగ విరమణ వయసు పెంపు ప్రతిపాదన ఎప్పటి నుంచి, ఎలా అమలు చేయాలనే అంశంపై చర్చిస్తాం. పీఆర్‌సీ, ఉద్యోగ విరమణ వయసు పెంపు పరస్పరం ముడిపడిన అంశాలు కావడంతో రాష్ట్ర ఆర్థిక వనరులను అధ్యయనం చేసి ఎంత మేరకు భారం పడుతుందో చూసి ఒక ప్యాకేజీ కింద ఇస్తాం. 

ప్రస్తుతమున్న చోటే సచివాలయం.. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ.. 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడం వల్ల హైదరాబాద్‌లో సచివాలయం, శాసనసభ భవనాల అప్పగింత దాదాపు పూర్తయింది. బుధవారం అధికారికంగా అప్పగించే అవకాశం ఉంది. ఈ రెండు భవనాలు ఖాళీ అయిన తర్వాత తెలంగాణకు కొత్తగా సచివాలయం, అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని మంత్రివర్గం తీర్మానించింది. సెక్రటేరియట్‌ను ప్రస్తుతమున్న చోటే నిర్మించడంతోపాటు ఎలా నిర్మించాలనే దానిపైనా చర్చించాం. గతంలో సచివాలయం నిర్మాణం కోసం బైసన్‌ పోలో మైదానం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని అడిగాం. అయితే సెక్రటేరియట్‌ భవనాలు ఇచ్చేది లేదని ఏపీ ప్రభుత్వం భీష్మించడంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషించాం. ప్రస్తుతమున్న చోటే అనువుగా ఉండటంతో సెక్రటేరియట్‌ ఇక్కడే నిర్మించాలని నిర్ణయించాం.

సుమారు ఐదారు లక్షల చదరపు అడుగుల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక హంగులతో కూడిన భవన నిర్మాణం కోసం రూ. 400 కోట్లలోపు ఖర్చయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ భవనం కూడా దాదాపు రూ. 100 కోట్లతో పూర్తయ్యే అవకాశం ఉంది. శాసనమండలి, శాసనసభ, సెంట్రల్‌ హాల్‌ సమాహారంగా పార్లమెంటు తరహాలో లెజిస్లేచర్‌ సెక్రటేరియట్‌తోపాటు ఎర్రమంజిల్‌లోని ఇంజనీరింగ్‌ కార్యాలయాల సముదాయంలో 17 ఎకరాల స్థలంలో నిర్మిస్తాం. ప్రస్తుతమున్న అసెంబ్లీ భవనం చారిత్రిక సంపదను కాపాడుతూ.. కొత్తగా కట్టే అసెంబ్లీ భవనం కూడా ఇదే ఎలివేషన్‌ ఉండదాలని నిర్ణయించాం. రాజులు కట్టి ఇచ్చిన చరిత్ర రిచ్‌ కాబట్టి బయటకు పాత, కొత్త భవనాలు ఒకేలా కనబడేలా నిర్మించాలనుకుంటున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్కిటెక్టులు భవనాల డిజైన్లు పంపిస్తున్నారు. ఫౌంటెయిన్లు, గార్డెన్లతో హుస్సేన్‌సాగర్‌కు అభిముఖంగా సెక్రటేరియట్‌ నిర్మిస్తాం. దసరా వరకు మంచిరోజులు లేకపోవడంతో ఈ నెల 27న దశమి రోజున సెక్రటేరియట్, సచివాలయం భవనాలకు భూమి పూజ చేస్తాం.

సెక్రటేరియట్‌ కూల్చివేత తదితరాలకు సంబంధించి రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో ఉపకమిటీ వేశాం. సబ్‌ కమిటీ నివేదికపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను సీఎం కేసీఆర్‌కు అప్పగిస్తూ కేబినెట్‌ నిర్ణయించింది. కచ్చితంగా నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించాం. పంచాయతీరాజ్‌ సంస్థలన్నీంటినీ క్రియాశీలం చేయాలని, వారికి హరితహారం, ఉపాది హామీ వంటి పథకాల అమలు అప్పగింతపై పరిశీలన చేస్తున్నాం. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి ఓ నిర్ణయానికి వస్తామన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన అధికారాలు, నిధులను ఇవ్వాలని సూత్రాప్రాయంగా నిర్ణయించాం.  

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, తలసాని, ఈటల, జగదీశ్‌రెడ్డి, మహమూద్‌అలీ, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement