మోటార్ సాంకేతిక అంశాలను సరిచేస్తున్న ఏబీపీ కంపెనీ నిపుణులు
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును 21వ తేదీన శుక్రవారం ప్రారంభించనున్న విషయం విదితమే. ఈ మేరకు ఇరిగేషన్, కాంట్రాక్టు సంస్థల ఏజెన్సీల ప్రతినిధులు, పోలీసు అధికారులతో మేడిగడ్డ బ్యారేజీ, పుంపుహౌస్ ప్రాంతాలన్నీ హడావుడిగా మారాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ వద్ద హోమం పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి హోమశాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యారేజీలో మూడు గేట్లు ఎత్తి ప్రారంభించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారేజీలో మొత్తం ఎనిమిది బ్లాకులు ఉండగా.. ఇప్పటికే మూడు బ్లాకుల్లో నీటిని నిల్వ చేయడానికి నిలిపారు.
ఎక్కువ సమయం కన్నెపల్లి వద్దనే..
ఈనెల 21న హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అలాగే, మహారాష్ట్ర, ఏపీ సీఎంలు ఫడ్నవిస్, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సైతం అక్కడికే వస్తారని తెలిసింది. దీంతో మేడిగడ్డ వద్ద పూజలు ప్రారంభించి.. ఆ వెంటనే కన్నెపల్లి చేరుకుని అక్కడ జరిగే పూజల్లో ఎక్కువ సమయం పాల్గొంటారని సమాచారం.
ఆరో మోటార్‌కు కేసీఆర్ స్విచ్ ఆన్
కన్నెపల్లి పంపుహౌస్‌లో 3 మోటార్లు నడపడానికి వీలుగా సిద్ధం చేస్తున్నారు. ముగ్గురు సీఎంలు 3 మోటార్ల స్విచ్ ఆన్ చేస్తారు. సీఎం కేసీఆర్ ఆరో నంబర్ మోటార్‌ను ప్రారంభిస్తారు. దీంతో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, ఏబీపీ కంపెనీ నిపుణులు స్టీఫెన్, అలెక్స్ సాంకేతిక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
వీఐపీ నుంచి సామాన్యుడి దాకా..
మూడు చోట్ల వేర్వేరుగా వీవీఐపీలు, వీఐపీలు, సామాన్యులకు ఒకే విధంగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. వంటలన్నీ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్యాటరింగ్ సంస్థకు అప్పగించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ముందు వంటలు సిద్ధం చేశాక మూడు చోట్లకు తీసుకొస్తారు.
అడుగడుగునా పోలీసుల తనిఖీలు
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు మేడిగడ్డ బ్యారేజీ నుంచి కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో ఎస్పీ ఆర్.భాస్కరన్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనుమానితులు కనిపిస్తే విచారించడమే కాకుండా మాజీలపై ప్రత్యేక దృష్టి సారించారు. దారి మధ్యలో కల్వర్టులు, వాగుల వద్ద బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల పరిసరాల్లో ఇప్పటికే 300 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తుండగా, 108 మంది డాగ్, బాంబ్‌స్క్వాడ్ బృందాలు పాల్గొంటున్నాయి. ప్రారంభోత్సవం ముందు రోజు రెండు వేల మంది సివిల్, హోంగార్డులు, స్పెషల్ పార్టీ, డిస్ట్రిక్ట్ గార్డులు, పోలీసులు రెండు చోట్ల విధుల్లో చేరనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం బ్యారేజీ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు.. డీఈఈ సూర్యప్రకాశ్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం సాయంత్రం వారు పంపుహౌస్‌లో పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఐదు వేల మంది వీక్షించేలా...
కన్నెపల్లి పంపుహౌస్‌లో మూడు మోటార్లకు ముగ్గురు సీఎంలు స్విచ్ ఆన్ చేయడానికి ముందు ప్రత్యేక హోమం, పూజలు చేయనున్నారు. ఈ పూజల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఏపీ సీఎం జగన్ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో సుమారు 5వేల మందికి పైగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఫోర్‌బే ముందు నుంచి హోమ స్థలం వరకు ప్రత్యేకంగా షామియానాలు వేస్తున్నారు.
‘కాళేశ్వరం’ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో మంగళవారం డీజీపీ మహేందర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 21వ తేదీన జరిగే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావుతోపాటు, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లు హాజరుకానున్నారు. గవర్నర్‌తోపాటు మూడు రాష్ట్రాల సీఎంలు వస్తున్న నేపథ్యంలో పోలీసుశాఖ అత్యంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాంతంలో మహేందర్‌రెడ్డి స్వయంగా పర్యటించి రక్షణ చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీజీపీతోపాటు జిల్లా ఇంటలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్, ఓఎస్డీ ఎంకే సింగ్, నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్, డీఐజీ రాజేశ్‌కుమార్, కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment