భద్రాచలం: ముంపు మండలాలను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో లాంఛనాన్ని పూర్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో సెప్టెంబర్ 1 నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే పాలన సాగేలా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. దీనిలో భాగంగానే ‘తూర్పుగోదావరి జిల్లా రాజపత్రం’ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులతో రంపచోడవరం ఆర్‌డీవో కార్యాలయం నుంచి ప్రత్యేక దూత గురువారం చింతూరు, కూనవరం, వీఆర్ పురం, భద్రాచ లం ఎంపీడీవో, తహశీల్దారులకు నేరుగా ఇచ్చారు. ‘విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకునే విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రజలు నేరుగా లేదా లేఖల ద్వారా తెలియజేయవచ్చు’ అని కూడా అందులో ఉంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా రాజపత్రాన్ని అక్కడి కలెక్టర్ నుంచి కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలకు అందాయి.ఉత్తర్వులు వెలువడిన 30 రోజుల్లోగా ప్రజలు తమ సలహాలను, అభ్యంతరాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని రాజపత్రంలో ఉంది.
మండల కార్యాలయాలు నెల్లిపాకకు తరలింపు
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా అధికారుల నుంచి భద్రాచలం డివిజన్‌లోని ముంపు మండలాలకు పలుమార్లు వివిధ అంశాలపై లేఖలు పంపిచారు. అవి చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండల అధికారులకు మాత్రమే అందాయి. తూర్పుగోదారి జిల్లా రాజపత్రం పేరిట ఉన్న ఉత్తర్వులు భద్రాచలం మండల అధికారులకు కూడా అందజేశారు.
భద్రాచలం రెవెన్యూ గ్రామం మాత్రమే తెలంగాణకు మినహాయించి, మిగతా మండలంతా ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించి, నెల్లిపాక మండల కేంద్రంగా ప్రకటించారు. భద్రాచలం రెవెన్యూ గ్రామంలోని కార్యాలయ భవనాలు ఇక్కడనే ఉంటాయని, వీటిలో పనిచేస్తున్న ఉద్యోగులంతా నెల్లిపాక కేంద్రంగా విధులు నిర్వహించాల్సుంటుందని తూర్పు గోదావరి జిల్లా అధికారులు చెబుతున్నారు. దీనినిబట్టి ఎంపీడీవో, తహశీల్దార్, ఇతర సిబ్బంది నెల్లిపాకకు వెళ్లాల్సిందేనా..? అనే చర్చ సాగుతోంది. దీనిలో భాగంగానే భద్రాచలం మండల అధికారులకు కూడా ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం.
గ్రామసభలకు ముందుకెళ్లేదెలా..?
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి తరచూ ముంపు మండల అధికారులకు ఉత్తర్వులు అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భాగంగా, ఖమ్మం కలెక్టర్ అజమాయిషీలో పనిచేస్తున్న తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవాలని ఇక్కడి అధికారులు బహిరంగానే ప్రశ్నిస్తున్నారు. ముంపు మండలాల ఎంపీపీ ఎన్నికల విషయంలో ఇలానే వ్యవహరించగా, ఎన్నికల కమిషన్ నుంచి అక్షింతలు వేయించుకోవాల్సి వచ్చింది. తాజాగా, ముంపు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలంటూ అక్కడి తూ.గో. జిల్లా పరిషత్ సీఈవో ఆదేశించారు.
ఈ నెల 19న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక సర్వేకు ఇక్కడి అధికారులు సిద్ధమవుతుఆన్నరు. ఇలా, రెండు ప్రభుత్వాల నుంచి వస్తున్న ఆదేశాలతో ముంపు మండలాల్లోని అధికారులు ,ఉద్యోగులు ఇరకాటంలో పడుతున్నారు. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణపై గ్రామసభలకు ఎలా వెళ్లేదని వారు అయోమయంలో ఉన్నారు.
‘ముంపు’లో ఆంధ్ర పాలనకు రెడీ..!
Published Fri, Aug 8 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement
Advertisement