![Another IT hub in the city - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/16/ENTREPRISE.jpg.webp?itok=zyc1qHRU)
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రాచబాట వేస్తోంది. మరో ఐటీ క్లస్టర్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలకు ద్వారాలు తెరుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలకు వేదికగా మారిన రాష్ట్ర రాజధానిలో మరో ఐటీ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తోంది. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ కేంద్రంగా 290.37 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్లస్టర్ రానుంది. ఇందులో భాగంగా వివిధ సంస్థలకు గతంలో కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటోంది. హెచ్‌ఎండీఏ 82 ఎకరాలు, వీడీఓటీసీ/వాలంతరీ 80.37 ఎకరాలు, హిమాయత్‌సాగర్, రేవతిపేట్, బుద్వేల్, కిస్మత్‌పూర్‌లో 130 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. ఈ భూములను ఐటీ హబ్ కోసం వినియోగించుకోవాలని నిర్ణయించింది.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో ఇక్కడ ఐటీ కంపెనీలు కొలువుదీరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే వాల్యూల్యాబ్స్, వెల్స్‌ఫార్గో, ఇన్‌ఫినిటీ, నోహ, ఇ–సెంట్రిక్, మాపల్ ట్రీ, యాష్ టెక్నాలజీస్ తదితర సంస్థలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. అంతేగాకుండా డేటా సెంటర్ల స్థాపనకు కూడా ఈ హబ్ అనువుగా ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే ఐటీ హబ్‌గా మారిన గచ్చిబౌలి, మాదాపూర్, ఆదిభట్ల కాకుండా.. ఐటీ పరిశ్రమలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని సంకల్పించిన రాష్ట్ర సర్కారు తాజాగా బుద్వేల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో ఉండడం, అంతర్జాతీయ విమానాశ్రయం కూతవేటు దూరంలో ఉండడం, జంట జలాశయాలు కూడా చెంతనే ఉన్న నేపథ్యంలో ఈ భూముల్లో పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్‌వేర్ సంస్థలు బారులు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే టీఎస్‌ఎల్‌ఏ కూడా ఆమోదముద్ర వేసిన తరుణంలో త్వరలోనే వీటిని ఐటీ శాఖకు బదలాయించే యోచనలో రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment