ఆకర్షణీయంగా ఐటీ పాలసీ! | Telangana IT policy to be declared by next week in this month, says KTR | Sakshi
Sakshi News home page

ఆకర్షణీయంగా ఐటీ పాలసీ!

Published Mon, Dec 8 2014 12:52 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

ఆకర్షణీయంగా ఐటీ పాలసీ! - Sakshi

ఆకర్షణీయంగా ఐటీ పాలసీ!

* పారిశ్రామిక విధాన స్ఫూర్తిని ప్రతిబింబించేలా రూపొందిస్తాం  
* మూడోవారంలో వెల్లడిస్తాం: ఐటీ మంత్రి కేటీఆర్
* పట్టణాల్లో ఐటీ సంస్థల స్థాపనకు ముందుకు వచ్చేవారికి ప్రోత్సాహం
* ఐటీ సంస్థలకు సత్వర అనుమతులు
* ఐటీ పరిశ్రమల ప్రతిపాదనలను పరిష్కరించేందుకు ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త ఐటీ పాలసీని ఈనెల మూడోవారంలో ప్రకటించనున్నట్లు పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఐటీ పరిశ్రమకు హైదరాబాద్‌ను మరింత ఆకర్షణీయమైన గమ్యంగా మార్చుతామని చెప్పారు. నూతన విధానంలో ఉండబోయే కొన్ని అంశాలను మంత్రి ఆదివారమిక్కడ వెల్లడించారు. ఐటీ పరిశ్రమ వర్గాలను భాగస్వాములను చేసి, వారి అవసరాలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకొని కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధాన(టీఎస్-ఐపాస్) స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ పాలసీ ఉంటుందన్నారు. కంపెనీల స్థాపనకు తక్కువ సమయంలోనే అనుమతులు ఇచ్చే విధానాన్ని ఐటీ పరిశ్రమకు కూడా వర్తింపజేస్తామన్నారు.
 
 20 లక్షల మందికి ఉపాధి కల్పించేలా...
 నూతన ఐటీ పాలసీ ద్వారా రూ.1.20 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ఇప్పటికే ఆకర్షణీయమైన వృద్ధిరేటు సాధిస్తున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమ, భవిష్యత్తులో 16 శాతం వృద్ధితో సుమారు 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేలా విధానాలను రూపొందిస్తున్నామన్నారు. ఉపాధికి అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను అమలు చేయబోతున్నట్లు చెప్పారు. చదువు పూర్తి కాగానే పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరాలతోపాటు రె ండో తరగతి పట్టణాల్లో కూడా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు.
 
 చేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తాం..
 ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు... ఐటీ సంస్థల ప్రతిపాదనలను త్వరగా పరిష్కరించేందుకు ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘‘పరిశోధనల ద్వారానే ఐటీ పరిశ్రమ అభివృద్ధి వేగంగా జరుగుతుందని భావిస్తున్నందున, ఆర్‌అండ్‌డీ రంగంలో స్టార్టప్ కంపెనీలకు అదనపు సౌకర్యాలు కల్పిస్తాం. సోషల్ మీడియా, అనలిటిక్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలకు కూడా కొత్త పాలసీలో ప్రాధాన్యం ఇస్తున్నాం. హైదరాబాద్‌ను వైఫై నగరంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హై-ఫై’ వ్యవస్థపైనా దృష్టి సారించాం. టాస్క్, టీ హబ్ వంటి కార ్యక్రమాలను కూడా ఈ పాలసీలో చేర్చాం’’ అని మంత్రి వివరించారు. నూతన పాలసీలపై ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చామని, ఇంకా కసరత్తు చేసి మరిన్ని ఆకర్షణీయ విధానాలను, కంపెనీలకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తామన్నారు. కొత్త ఐటీ పాలసీ రూపకల్పనకు ఐటీ విభాగం ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, ఇతర ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement