వర్గీకరణ కోసం మరో ఉద్యమం : మంద కృష్ణ
నల్లగొండ రూరల్ : ఎస్సీ వర్గీకరణ కోసం డిసెంబర్ 2వ వారం నుంచి మరో ఉద్యమం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. గురువారం స్థానిక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు ఉన్నప్పటికీ చట్టసభల్లో నాలుగు నిమిషాల మాట్లాడని దద్దమ్మలన్నారు.
పోరాటం చేసేవారిని వదిలి అసమర్థ మాదిగ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు, కేసీఆర్, ఎల్‌కె.అద్వాని, వెంకయ్యనాయుడులు వర్గీకరణకు మద్దతు పలికారని, దివంగత వైఎస్‌ఆర్ ఢిల్లీకి తీసుకెళ్లి సోనియాగాంధీని కలిపిం చారని తెలిపారు. వర్గీకరణ ద్వారా మాదిగలకు 12శాతం రిజర్వేషన్ లభిస్తుందని, తద్వార మాదిగ జాతి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను కావాలనుకుంటే ఎమ్మెల్యేనో, ఎంపీనో అయ్యేవాడినని, కానీ జాతి ఆత్మగౌరవం కోసమే పోరాటం నిర్వహిస్తున్నానని తెలిపారు.
ఉద్యమ పోరాటానికి మహాజన సోషలిస్టు పార్టీకి సంబంధం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇందుకు మాయావతి, కాన్షిరాం పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లింగస్వామి, నరేష్, కోళ్ల శివ, సోమయ్య, చేకూరు గణేష్, రవి, కె.మోహన్, అధ్యాపకులు ఉన్నారు.