
బయటపడిన శివుడి విగ్రహాలు, పూజా సామగ్రి
యాదగిరిగుట్ట : మండలంలోని దాతారుపల్లిలో బుధవారం ఓ ఇంటిని కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామాగ్రి బయటపడ్డాయి. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దాతారుపల్లికి చెందిన జంగం రాములు స్థానిక శివాలయంలో పూజారి. ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అందులో ఉన్న విగ్రహాలతో పాటు పూజ సామగ్రిని గ్రామస్తులు రాములు ఇంట్లో భద్రపరిచారు. ఆలయం నిర్మిస్తున్న సమయంలోనే రాములు అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆయన భార్య జయమ్మ, పిల్లలు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నారు. జయమ్మ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. ఇల్లు శిథిలావస్థకు చేరడంతో వర్షాలకు క్రమక్రమంగా కూలిపోతోంది. బుధవారం జయమ్మ, ఆమె కుమారులు వచ్చి ఇంటిని పూర్తిగా కూల్చివేస్తున్న క్రమంలో భద్రపరిచిన విగ్రహాలు, పూజ సామాగ్రి బయటపడ్డాయి. స్థానికులు, సర్పంచ్ బైరగాని పుల్లయ్యగౌడ్, ఎంపీటీసీ కాల్నె అయిలయ్య, ఉప సర్పంచ్ కాల్నె భాస్కర్‌లు విగ్రహాలను, పూజ సామాగ్రికి పూజలు నిర్వహించి ఆలయంలోకి తరలించారు.