
హైదరాబాద్‌లోని రిట్జ్ హోటల్ ప్రాంతం
• సచివాలయం అప్పగింతకు ఏపీ కొత్త ప్రతిపాదన
• రిట్జ్ హోటల్ పక్కన ఖాళీ స్థలం ఇవ్వాలని రాయబారం
• స్థలానికి బదులు హెర్మిటేజ్ భవనం ఇవ్వాలని తెలంగాణ యోచన
• తాత్కాలిక భవనాలకు ఆఫీసుల తరలింపు బాధ్యత జీఏడీకి
సాక్షి, హైదరాబాద్: తమ అధీనంలో ఉన్న భవనాలను అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. తాత్కాలిక భవనంతో పాటు కొత్త సచివాలయం నిర్మించుకునేందుకు తమకు స్థలం అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరనుంది. ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలోని రిట్జ్ హోటల్ పక్కనున్న స్థలం తమకు కేటాయించాలని రాయబారం పంపిం చినట్లు తెలిసింది. తమ భవనాలను అప్పగించేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సమ్మతించింది. అవి ఖాళీగానే ఉన్నందున, తెలంగాణ అవసరాలకు అప్పగించేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డట్లు సమాచారం.
సచివాలయంలోని భవనాలతో పాటు అసెం బ్లీ, కౌన్సిల్ భవనాలు ఇచ్చేందుకు ఇటీవల గవర్నర్‌తో భేటీ సందర్భంగా చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం పరిధిలో ఉన్న అంశం కావటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సచివాలయం అప్పగించాలని కోరుతూ మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించిం ది. ఏపీ లేవనెత్తిన ప్రతిపాదనపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న వ్యాపార, వాణిజ్య పరమైన స్థలాలను ఎవరికీ అప్పగించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీ కోరినట్లుగా స్థలాన్ని ఇవ్వాలా.. వద్దా అనేది కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కూల్చివేతకు రూ. 30 కోట్లు...
ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ విభాగానికి అప్పగించింది. కూల్చివేతలకు దాదాపు రూ.30 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. వీటికి టెండర్లు పిలవాలని యోచిస్తోంది. మరోవైపు సచి వాలయం తరలించే పనులను ప్రభుత్వం సాధారణ పరిపాలన విభాగాని(జీఏడీ)కి అప్పగిం చింది. ఆఫీసుల తరలింపుతో పాటు కొత్త భవనాల్లో అదే తీరుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
ఆఫీసు వాతావరణంతో పాటు అధికారుల హోదాకు తగినట్లుగా కార్యాలయాల్లో ఏసీలు, ఫర్నిచర్ సిద్ధం చేసి.. ఫైళ్లను భద్రపరచాల్సి ఉంటుంది. అవసరమైనన్ని కంప్యూటర్లు, సర్వర్ సేవలన్నీ యథాతథంగా అమర్చాలి. ఇవన్నీ జీఏడీ పర్యవేక్షణలో చేపడతారు. రాష్ట్ర పునర్విభజన సమయంలోనే సచివాల యంలో ఉన్న కొన్ని సెక్షన్ల తరలింపు, అన్ని సేవల పునరుద్ధరణకు ఆరు నెలల సమయం పట్టిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక భవనాలకు తరలివెళ్లడం ప్రయాసతో కూడుకున్న పనేనని, ప్రభుత్వ కార్యకలాపాలు మళ్లీ కొంతకాలం స్తంభించిపోతాయని అభిప్రాయపడుతున్నారు.
సీఎం క్యాంపు ఆఫీసులోనే కేబినెట్ భేటీలు
సచివాలయం తరలింపు నేపథ్యంలో ఇకపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే నిర్వహించనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న సీఎం అధికారిక నివాసంలోనే అందుకు ప్రత్యేక హాల్‌ను నిర్మిస్తున్నారు. ఇకపై జరిగే కేబినెట్ భేటీలు అక్కడే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు.
ఉరుకులు పరుగులు..
సచివాలయాన్ని తరలించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. 15 రోజుల్లో ఆఫీసులు ఖాళీ చేయాలని ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక భవనాలను వెంటనే పరిశీలించాలని.. తమ శాఖల అవసరాలకు సరిపోతాయో లేదో స్వయంగా పర్యవేక్షించాలని సూచించింది. దీంతో అన్ని శాఖల అధికారులు మంగళవారం అదే పనిలో నిమగ్నమయ్యారు. తమకు నిర్దేశించిన తాత్కాలిక భవనాలకు వెళ్లి సదుపాయాలను పరిశీలించారు.
సచివాలయంలో ఉన్న కీలకమైన విభాగాలన్నీ బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలించటం ఖాయమైంది. ప్రస్తుతం బీఆర్‌కే భవన్‌లో ఉన్న విజిలెన్స్ ఆఫీసులతో పాటు మిగతా కార్యాలయాలను నాంపల్లిలోని గృహకల్ప, మనోరంజన్ భవన్‌లకు తరలించాలని నిర్ణయించారు. ఏపీ సచివాలయానికి ప్రస్తుతం సెర్ప్ ఆఫీసున్న హెర్మిటేజ్ కాంప్లెక్స్‌ను అప్పగించాలని నిర్ణయించారు. సెర్ప్ ఆఫీసును తరలించేందుకు సంబంధిత అధికారులు అమీర్‌పేటలోని మైత్రీవనం లేదా పాత అపార్డ్ భవన్‌ను పరిశీలించారు.