
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనల యావ అధికారులకు పంటపండిస్తోంది. ప్రకటనలకోసం ప్రభుత్వం తపనపడుతుంటే కొందరు అధికారులు ఈ ముసుగులో తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టి దోస్తు మేరా దోస్తంటూ కథ నడిపించేస్తున్నారు. టెండర్లు పిలవకుండానే వలపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఏపీ సమాచార పౌర సంబంధాలశాఖ (ఐఅండ్‌పీఆర్) ఓ యాడ్ ఏజెన్సీకి ఏకపక్షంగా లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. మౌలిక సదుపాయాలు లేకుం డా 30 రోజులు ప్రచారానికి సదరు యాడ్ ఏజెన్సీకి రూ.4.57 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. వాస్తవానికి సదరు ఏజెన్సీకి కాంట్రాక్టు ఇచ్చేముందు టెండర్లు పిలవక పోవడం గమనార్హం.
ఏం జరిగింది?: ప్రస్తుతం జన్మభూమి కార్యక్రమాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించేందుకు ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలో ఏపీ ప్రభుత్వం ప్రచారం నిర్వహించాలనుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు వారికి అత్యంత సన్నిహితంగా ఉండే హైదరాబాద్‌కు చెందిన డీడీ కమ్యూనికేషన్ అధినేతను విజయవాడకు పిలిపించారు. టెండ ర్లు లేకుండా.. ఏకపక్షంగా కాంట్రాక్టు ఇచ్చేశారు. ఒప్పందం ప్రకారం.. 400 సెంటర్లలో ఉన్న ఎల్‌ఈడీ టీవీల్లో 30 సెకండ్ల నిడివిగల ప్రచార ప్రకటనలను 300 సార్లు ప్రచారం చేయాలి. వీటిని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, గ్రేటర్ నగరాలు అని మూడు గ్రేడులుగా విభజించారు. ఈ సంస్థకు వచ్చేనెల 3న అందు కు చెల్లింపులను సైతం చేసేందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
- 30 రోజుల ప్రచారంలో సెలవుదినాలు కూడా కలిపి డబ్బులు ఎందుకు ఇస్తున్నారో సమాధానం లేదు. సంక్రాంతికి ఇప్పటికే 3 రోజులు ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలు మూసివేశారు. ఆదివారాలు కూడా కేంద్రాలు పనిచేయడం లేదు. ఇక జనవరి 26 తదితర సెలవుదినమే ఈ రోజులకు కూడా బిల్లులు ఎలా ఇస్తారు?
- ఇదే ప్రచారానికి శాటిలైట్ చానళ్లకు నెల మొత్తం ప్యాకేజీకి రూ.45 లక్షల నుంచి రూ. 50 లక్షలే ఖర్చవుతోంది. కోట్లాదిమంది ప్రేక్షకులు ఉన్న చానళ్లకు అంతతక్కువగా ఇస్తుంటే.. స్మార్ట్ యుగంలో ఎంతమంది ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలకు వెళ్తున్నారు. వారిలో ఎందరు ఈ ప్రకటనలను చూస్తారన్నది సందేహమే!
- ఈ టెండరు విషయం మిగతా ఏజెన్సీలకు ఎందుకు చెప్పలేదు. హడావుడిగా ఎలా ఇచ్చారు?
ప్రకటనలకు చెల్లింపు తీరు ఇలా...
నగరం రేటు ఒక కేంద్రానికి 30 రోజులకు
గ్రేటర్‌సిటీల్లో : రూ.20–రూ.1,80,000
జిల్లా కేంద్రాల్లో : రూ.15–రూ. 1,35,000
మున్సిపాలిటీల్లో : రూ.10–రూ. 90,000
మొత్తం కేంద్రాలు: 400
చెల్లించే మొత్తం: రూ.4.57 కోట్లు
ప్రచారం చేయకపోతే బిల్లులు ఇవ్వం
సదరు కంపెనీకి అన్ని అర్హతలు ఉన్నాయి. అందుకే, టెండర్లు పిలవకుండా ఇచ్చాం. వారు ఎన్ని రోజులు ప్రచారం చేశారో.. మాకు రిపోర్టు వస్తుంది. ఎన్నిరోజులు చేశారని తెలిస్తే.. అన్ని రోజులకే చెల్లిస్తాం.
– వెంకటేశ్వర్లు, కమిషనర్, ఏపీ, ఐఅండ్ పీఆర్
మాకు టెండరు వచ్చిన మాట వాస్తవం. ఈ విషయంలో మేమేం చెప్పలేము. ఏమైనా ఉంటే కమిషనర్‌గారిని అడగండి.
– దేవదాస్, డీడీ కమ్యూనికేషన్స్
Comments
Please login to add a commentAdd a comment