పోలీసుల తీరు జుగుప్సాకరం!
లేని రికార్డులు సృష్టించడం దారుణం: హైకోర్టు
పీడీ కేసుల్లో సకాలంలో నిర్బంధ కారణాలను వెల్లడించని పోలీసులు
ధర్మాసనం పరిశీలనకు ముందు రికార్డుల్లో మార్పులు
తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం..
ప్రభుత్వానికి రూ.50 వేల జరిమానా
విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలివైన నేరస్తులైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి పోలీసులకు దొరికిపోతూ ఉంటారు. మరి పోలీసులే తప్పు చేసి కోర్టుకు దొరికిపోతే..? హైదరాబాద్ పోలీసులు తప్పుడు రికార్డులు సృష్టించి హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయారు. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇటువంటి చర్యల వల్ల అధికార యంత్రాంగంపై పౌరులకు ప్రతికూల భావన ఏర్పడుతుందని స్పష్టం చేసింది. న్యాయ ప్రక్రియను కూడా కలుషితం చేస్తుందని ఆక్షేపించింది. పోలీసుల తప్పునకు గాను ప్రభుత్వానికి రూ.50 వేల జరిమానా విధించింది. ఈ మొత్తం వ్యవహారంపై శాఖాపరమైన విచారణ జరపాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
నిర్బంధం వివరాలివ్వనందుకు..
హర్యానాకు చెందిన సురేందర్‌సింగ్, ఫూల్‌సింగ్‌లను తెలంగాణ పీడీ యాక్ట్ కింద నిర్బంధిస్తూ ఈ ఏడాది మార్చి 7న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అరుుతే సురేందర్, ఫూల్‌సింగ్‌ల నిర్బంధంపై వారి తల్లి, భార్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సురేందర్, ఫూల్‌సింగ్‌ల చర్యలు శాంతిభద్రతల సమస్య కిందకు వస్తాయే తప్ప, పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘన కిందకు రావని తెలిపారు. పీడీ చట్టం ప్రకారం.. నిర్బంధించిన కారణాలను ఆ వ్యక్తులకు నిర్బంధ ఉత్తర్వులు వెలువరించిన ఐదు రోజుల్లోపు వారికి అర్థమయ్యే భాషలో అందచేయాల్సి ఉంటుందని నివేదించారు.
ఈ కేసులో సురేందర్, ఫూల్‌సింగ్‌లకు హిందీ మాత్రమే వచ్చునని, పోలీసులు వారికి నిర్ణీత గడువులోపు ఆ భాషలో నిర్బంధ కారణాలను తెలియచేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అరుుతే తాము గడువులోపే హిందీ కాపీలను సురేందర్, ఫూల్‌సింగ్‌లకు అందచేశామని పోలీసులు కోర్టుకు నివేదించారు. దీంతో మొత్తం రికార్డులను తెప్పించుకుని పరిశీలించిన ధర్మాసనం.. పోలీసులు తప్పుడు రికార్డులను చేర్చినట్లుగా గుర్తించింది. ‘‘10వ పేజీలో సురేందర్‌సింగ్‌కు ఇంగ్లిష్ కాపీలను చంచల్‌గూడ జైలర్ సమక్షంలో అందజేశారనేందుకు అక్నాలడ్‌జ మెంట్ ఉంది. దానిపై సురేందర్ వేలిముద్ర, జైలర్ సంతకం ఉన్నారుు. 11వ పేజీలో మార్చి 12న హిందీ కాపీలను అందుకున్నట్లు సురేందర్ వేలిముద్ర ఉంది. దానిపై జైలర్ సంతకంగానీ, సీల్‌గానీ లేదు. 12వ పేజీలో సురేందర్ నిర్బంధ ఉత్తర్వులు, కారణాల కాపీలను స్థానిక భాషలో అందచేసినట్లు మార్చి 8వ తేదీన జైలర్ ధ్రువీకరించినట్లు ఉంది.
12వ తేదీన హిందీలో కాపీలను అందచేసి ఉంటే.. అందుకు సంబంధించిన అక్నాలజ్డ్‌మెంట్ 10, 12 పేజీల మధ్యకు ఎందుకు వచ్చినట్లు?..’’ అని ధర్మాసనం పోలీసులను నిలదీసింది. ఇదంతా వెలుగు లోకి వచ్చాకైనా జైలర్ సమక్షంలోనే హిందీ కాపీలను ఇచ్చామనేందుకు ఆధార పూర్వకం గా జైలర్ అఫిడవిట్‌ను కూడా పోలీసులు దాఖలు చేయలేదని పేర్కొంది. అంటే కోర్టు ను తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు రికార్డులు మార్చినట్లు అర్థమవుతోందని స్పష్టం చేసింది. పోలీసుల తీరు చెప్పడానికే రోతగా ఉందని, ప్రతివాదులు ప్రభుత్వం, పోలీసుశాఖ అయి ఉండీ ఇటువంటి తప్పుడు పద్ధతుల ద్వారా కోర్టును మోసం చేసేందుకు యత్నించాయని ఆక్షేపించింది. గడువులోపు సంబంధిత భాషలో నిర్బంధ కారణాలను వివరించే కాపీలను అందచేయనందున.. సదరు వ్యక్తుల నిర్బంధం ఉత్తర్వులను రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.