
లండన్ ఎగ్జిబిషన్‌లో గొల్లభామ చీరల ప్రదర్శన
సాక్షి, సిద్దిపేట: చేనేత కార్మికుల ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. సిద్దిపేట మగ్గాలపై నేసిన గొల్లభామ డిజైన్లతో ఉన్న చీరలను లండన్ మగువలు, ప్రవాస భారతీయులు మెచ్చుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లండన్‌లో వివిధ దేశాల కళాకృతులు, హస్తకళల ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో గొల్లభామ చీరలను ఉంచారు. ఈ ప్రదర్శనను ప్రవాస భారతీయ సంతతికి చెందిన లండన్ ఎంపీలు సీమా మల్హోత్రా, వీరేంద్రశర్మతో పాటు అక్కడి ప్రజాప్రతినిధులు, మహిళలు గొల్లభామ చీరలను కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా మల్హోత్రా, వీరేంద్రశర్మ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే గొల్లభామ చీరల స్టాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు ప్రమోద్‌గౌడ్ అంతటి మాట్లాడుతూ, తెలంగాణ చేనేత కార్మికులు ప్రపంచ దేశాలు అబ్బురపడేలా చీరలు తయారు చేస్తున్నారని కితాబిచ్చారు. రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో గొల్లభామ చీరల ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment