చేనేత మగ్గాలను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్
దుబ్బాక: గత ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పట్టించుకోలేదని, ఫలితంగా నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయని ఐటీ, చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం భరోసానిస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలసి మంత్రి పరిశీలించారు. అందులో పని చేస్తున్న కార్మికుల జీవన స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.1,200 కోట్లు కేటాయించి తమ ప్రభుత్వం చరిత్రలో నిలిచిందన్నారు.
వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో చేనేత కార్మికులకోసం చేపడుతున్న అపెరల్, టెక్స్‌టైల్ పార్క్‌ల తరహాలో దుబ్బాకలో కూడా ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూలు, రసాయనాలు, ఇతర ముడిసరుకులను 50 శాతం సబ్సిడీపై చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. మరుగునపడుతున్న చేనేత వస్త్రాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి, నైపుణ్యాలను వెలికి తీయడానికే రాష్ట్ర ప్రభుత్వం చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి సమంతను నియమించిందన్నారు. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేనేత, పవర్‌లూమ్‌లకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తోందన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని అక్కడున్న అధికారులకు, టీఆర్‌ఎస్ కార్యకర్తలకు మంత్రి సూచించారు. దీంతో చేనేత కార్మికులకు పరోక్షంగా ఉపాధిని ఇచ్చినవాళ్లమవుతామన్నారు.
దుబ్బాక చేనేతలకు రూ. 1.56 కోట్ల రుణాల మాఫీ
దుబ్బాక సహకార సంఘంలో పనిచేస్తున్న చేనేత కార్మికులకు సంబంధించిన రూ. 1.56 కోట్ల రుణాలను ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక మేరకు మాఫీ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సిద్దిపేటలోని చేనేత కార్మికుల రుణాల విషయాన్ని మంత్రి హరీశ్‌రావు తన దృష్టికి తెచ్చారని, వారికి కూడా రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. చేనేతకు పూర్వ వైభవం తీసుకరావడానికి కోటి రూపాయల వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చేందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తామని హామీనిచ్చారు.
బిడ్డా బాగున్నావా.. మాది మీ ఊరే!
కేటీఆర్‌ను ఆప్యాయంగా పలకరించిన వజ్రవ్వ
దుబ్బాక టౌన్: ‘ఏం బిడ్డా మంచిగున్నవా.. చిన్నప్పుడెప్పుడో చూసిన.. చాన ఏండ్లయింది నిన్ను చూడక...మాదీ మీ వూరే చింతమడక. చిన్నప్పుడు మీ నాయన చంద్రశేఖర్‌రావుతో కలసి మీ బాయికాడ మోటకొట్టేటోళ్లం’అంటూ దుబ్బాకకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను బ్యాగరి వజ్రవ్వ ఆప్యాయంగా పలకరించారు. దుబ్బాక చేనేత సహకార సంఘానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను చూసి, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద పనిచేసే వజ్రవ్వ అక్కడకు వెళ్లి పలకరించింది. మంత్రి ఆమె చెప్పిన విశేషాలను ఆసక్తిగా ఆలకించారు. ‘నాదీ చింతమడ్కనే.. లగ్గం అయి దుబ్బాకకు వచ్చిన. చిన్నప్పుడు మీ ఇంటివద్ద, బాయికాడ పనిచేసేదాన్ని’అంటూ వజ్రవ్వ జ్ఞాపకాలను నెమరువేసుకుంది. కేటీఆర్ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ‘పాణం ఎలా ఉంది? ఇప్పుడేం చేస్తున్నావు’అంటూ కుశలం అడిగారు. నాయన కేసీఆర్‌ను కలిపిస్తానంటూ చెప్పడంతో వజ్రవ్వ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment