
అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో డీకే అరుణ పిటిషన్..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే అరుణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభను సమావేశపరచకుండా, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే అసెంబ్లీని రద్దు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది నీరుప్‌రెడ్డి వాదించారు.
శాసనసభను సమావేశపరచకుండా అసెంబ్లీని ఎలా రద్దు చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ముందస్తు రద్దును సవాల్ చేస్తూ భారీగా పిటిషన్స్ దాఖలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ చర్యను తప్పుపడుతూ దాదాపు 200 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి. కాగా తెలంగాణ ఓటర్ల జాబితా సవరణపై దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ కొనసాగింది. ఈ పిటిషన్‌పై ఈసీ కౌంటర్ దాఖలు చేయగా, దీనిపై వాదనలు వినిపించేందుకు తమకు గడువు ఇవ్వాలని పిటిషనర్ కోరగా విచారణను కోర్టు వాయిదా వేసింది.
10న విచారణ
అసెంబ్లీ రద్దు పై కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కొమ్మి రెడ్డి రాములు సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీం ఆదేశాలతో హైకోర్టు లంచ్ మోషన్ పిటీషన్ గా స్వీకరించి బుధవారం విచారణను చేపట్టనుంది.70 లక్షల ఓట్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయని పిటిషనర్లు ఆరోపించారు. కాగా అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్లు అన్నింటిపై బుధవారం హైకోర్టు విచారిస్తుంది.