హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానంపై న్యాయస్థానాల్లో దాఖలైన వ్యాజ్యాలకు ఏ మాత్రం స్పందించని అసెంబ్లీ కార్యదర్శి ఇప్పుడు దిగొచ్చారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌లో హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో స్పందించక తప్పలేదు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తరఫు న్యాయవాది సాయికృష్ణ శుక్రవారం కోర్టుకు నివేదించారు.
మరో ప్రతివాదిగా ఉన్న న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు కూడా కౌంటర్ దాఖలుకు గడువు కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 27వ తేదీనే పూర్తిస్థాయి వాదనలు వింటానని ఉభయ పక్షాలకు స్పష్టం చేశారు.
ఫుటేజీ సమర్పిస్తానని అప్పటి ఏజీ హామీ
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై ఇయర్ ఫోన్ విసిరి గాయపరిచారన్న ఆరోపణలపై తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ, న్యాయ శాఖ, ఎన్నికల కమిషన్ కార్యదర్శులను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.
పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. ఇయర్ ఫోన్ విసిరిన నాటి వీడియో ఫుటేజీ సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అప్పటి అడ్వొకేట్ జనరల్ డి.ప్రకాశ్‌రెడ్డి.. ఆదేశాలు అవసరం లేదని, ఫుటేజీ సమర్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో న్యాయశాఖ, ఎన్నికల సంఘం కార్యదర్శికి నోటీసులిచ్చారు. అయితే ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన హామీ ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఆ హామీ ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. చివరకు ఆయన రాజీనామాకు దారి తీసింది.
ధిక్కార పిటిషన్‌తో కదలిన కార్యదర్శి
ఫుటేజీ ఇస్తానని ఏజీ హామీ ఇచ్చినా అసెంబ్లీ కార్యదర్శి మాత్రం ఏ రకంగానూ స్పందించలేదు. ఫుటేజీ ఇస్తానని కాని, ఇవ్వనని కాని కోర్టుకు చెప్పలేదు. కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. దీంతో ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్లను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి స్పందిం చకపోవడంతో వీడియో ఫుటేజీలోని అంశాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తున్నామని తీర్పులో పేర్కొన్నారు. ఆ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా ప్రధాన పిటిషన్‌లో ప్రతివాదులు కాని ఆ 12 మందికి అప్పీల్ దాఖలు చేసే అర్హత లేదంటూ ప్రాథమిక దశలోనే కోర్టు దాన్ని కొట్టేసింది.
మరోవైపు బహిష్కరణను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చినా అసెంబ్లీ దాన్ని అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బి.శివశంకరరావు ప్రతివాదులుగా ఉన్న నర్సింహాచార్యులు, నిరంజన్‌రావులకు గత నెల 15వ తేదీన నోటీసులు జారీ చేశారు. విచారణను శుక్రవారానికి (జూలై 13వతేదీకి) వాయిదా వేశారు.
కోమటిరెడ్డి, సంపత్‌లను సభకు అనుమతించడం లేదు
విచారణ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారని, వకాలత్ కూడా దాఖలు చేశామని, గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కార్యదర్శి తరఫు న్యాయవాది సాయికృష్ణ శుక్రవారం కోర్టుకు నివేదించారు. న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తరఫున అదనపు ఏజీ హోదాలో తాను హాజరవుతున్నట్లు జె.రామచంద్రరావు తెలిపారు. కౌంటర్ దాఖలుకు గడువు కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను తొలుత ఆగస్టు 3కు వాయిదా వేశారు.
ఈ సమయంలో కోమటిరెడ్డి, సంపత్‌ల న్యాయవాది స్పందిస్తూ.. కోర్టు ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి అమలు చేయలేదన్నారు. వారి పేర్లను శాసనసభ సభ్యుల జాబితాలో అప్‌లోడ్ చేయలేదన్నారు. వారిని సభలోకీ అనుమతించడం లేదన్నారు. దీంతో విచారణను 27కు న్యాయమూర్తి వాయిదా వేశారు. ఆ రోజే పూర్తిస్థాయి విచారణ జరుపుతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment