
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. తమ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లను ఎమ్మెల్యే పదవుల నుంచి అనైతికంగా తొలగించారని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా సీఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ బాధ్యతల నుంచి తొలగించాలని కోరారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్లీ ఎమ్మెల్యేల బహిష్కరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు.
ఎలాంటి కారణం లేకుండా ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించారని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. రాజ్యసభ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి అయిన అసెంబ్లీ సెక్రటరీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించి ఓటరు జాబితా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తొలగించారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో కోమటిరెడ్డి, సంపత్‌ల పేర్లు చేర్చాలని, అసెంబ్లీ సెక్రటరీని ఎన్నికల రిటర్నింగ్ బాధ్యతల నుంచి తొలగించాలని సీఈసీని కోరినట్లు ఆయన తెలిపారు.