MLA అవుతాననుకోలే.. | aroori ramesh in MLA | Sakshi
Sakshi News home page

MLA అవుతాననుకోలే..

Published Sun, Aug 24 2014 3:09 AM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM

MLA అవుతాననుకోలే.. - Sakshi

MLA అవుతాననుకోలే..

సాక్షి ప్రతినిధి, వరంగల్ :  మాది జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లు. నాన్న గట్టుమల్లు, అమ్మ వెంకటమ్మ. ముగ్గురు అన్నలు, ఇద్దరు అక్కలు. అన్నలు, ఒక బావ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఇంట్లో నేనే చిన్నవాణ్ని. 1967లో పుట్టిన నేను 1995లో పెళ్లి చేసుకున్నా. భార్య క వితాకుమారి. ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తోంది. మాకు ఇద్దరు పిల్లలు. విశాల్ ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అక్షిత పదో తరగతి చదువుతోంది. ఇదీ సింపుల్‌గా మా కుటుంబం. ఇక చిన్నప్పుడు స్కూల్, కాలేజీ ఎగ్గొట్టి శోభన్‌బాబు సినిమాలు బాగా చూసేవాడిని. ఇప్పుడు వీలుచిక్కినప్పుడల్లా పిల్లలతో కలిసి వెళ్తుంటా. మొన్న 19న సర్వేరోజున ఏషియన్‌మాల్‌లో సినిమా చూశా.  
 
నా మార్గదర్శి నాన్నే..
 
అన్ని విషయాల్లో నాన్నే నాకు మార్గదర్శి. దళిత కుటుంబంలో పుట్టినా అప్పట్లోనే ఆరో తరగతి వరకు చదువుకున్నారు. చదువు విలువ బాగా తెలిసిన వ్యక్తి. అప్పటి పంచాయతీ సమితి మొదటి అధ్యక్షుడు మార్నేని కిషన్‌రావు దగ్గర నాన్న పనిచేసేవారు. ఆయన దగ్గరే కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసేవారు. ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సాయంతో బావులు తవ్వించి డీజిల్ ఇంజిన్లు ఇచ్చేవారు. మా బాయిని అప్పటి కలెక్టర్ వచ్చి ప్రారంభించడం నాకు బాగా గుర్తు. అందరూ ఏదో ఒకపనిచేయాలని ఎవరూ ఖాళీగా ఉండకూడదని నాన్న చెప్పేవారు. సెలవుల్లో నన్ను బాయికాడికి తీసుకెళ్లి పనిచేయించేవారు. ఎడ్లుకాసే పని అప్పగించేవారు. ఒకసారి నేను బడికి వెళ్లకుంటే కోదండం ఎక్కించి ఇంట్లోపెట్టి తాళం వేసి వెళ్లిపోయారు. మా పెద్ద వదిన చూసి నన్ను బయటకు తెచ్చింది. చదువు విషయంలో నాన్న అంత కచ్చితంగా ఉండేవారు. అదే ఇప్పుడు నన్నీ స్థితిలో కూర్చోబెట్టింది.
 
కేసీఆర్ అభయమిచ్చారు
 
2008కి ముందే నేను టీఆర్‌ఎస్‌లో చేరాల్సింది. కొన్ని రాజకీయ కారణాలతో ఆలస్యమైంది. సకల జనుల సమ్మెకు ముందు కరీంనగర్‌లో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరా. ఆ తర్వాత కొద్ది రోజలకే స్టేషన్‌ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే టి.రాజయ్య పార్టీలోకి వచ్చారు. తర్వాత కడియం శ్రీహరి వచ్చారు. కె.విజయరామారావు అప్పటికే సీనియర్ నేత. ఇవేమీ పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోయా. ఆ పరిస్థితుల్లో మా అధినేత కేసీఆర్ ‘రమేశ్... నువ్వు నేను పెట్టిన మొక్కవు. నీకు ఇబ్బంది ఉండదు’ అని అభయమిచ్చారు. రాజకీయ అవకాశాలపై ఇబ్బంది ఉండదని కేటీఆర్ భరోసా కల్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నిక టి.హరీశ్‌రావుతో సాన్నిహిత్యం పెంచింది. నా పనితీరును ఆయన పరిశీలించారు. టీఆర్‌ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. టీఆర్‌ఎస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లా. నియోజకవర్గ ప్రజలు నన్ను అపూర్వంగా ఆశీర్వదించారు. 86,368 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన క్షణం నుంచి కేసీఆర్ నాకు అన్ని రకాలుగా పెద్ద దిక్కులా వ్యవహరించారు. నా మెజారిటీ చూసి అభినందించారు.
 
ఇంటర్‌లోనే టీడీపీలోకి..
 
ఇంటర్మీడియట్ సెకండియర్‌లో ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌యూ కార్యక్రమాలకు వెళ్తున్న కారణంగా పోలీసుల నుంచి ఒత్తిడి వచ్చింది. అప్పటికే టీడీపీ నాయకుడిగా ఉన్న గట్టు ప్రసాద్‌బాబు, మా మామ కలిసి నన్ను పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి సేవ్ చేశారు. అప్పుడే ప్రసాద్‌బాబు నాకు టీడీపీ సభ్యత్వం ఇప్పించారు. 1987లోనే తెలుగు యువత జఫర్‌గఢ్ మండల అధ్యక్షుడిగా పనిచేశా. 1994లో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడిగా పనిచేశా. పూర్తి అంకితభావంతో పార్టీ కోసం పని చేసేవాణ్ని. అప్పట్లో ఏ ఎన్నికలు వచ్చినా మా మండలంలో టీడీపీ గెలిచేది. 1994 ఎన్నికల్లో కడియం శ్రీహరి మా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. 2001లో టీఆర్‌ఎస్ హవా ఉంది. అప్పుడు జెడ్పీటీసీగా పోటీ చేయాలని కడియం శ్రీహరి నాపై ఒత్తిడి తెచ్చారు. నాకు ఆసక్తి లేక మరొకరిని నిలబెట్టి గెలిపించుకున్నాం. 2008లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. టీడీపీ అభ్యర్థి అరూరి రమేశ్ అని ఒక టీవీ చానల్‌లో స్క్రోలింగ్ వచ్చింది. నాకు అప్పటికి అటువంటి ఉద్దేశం లేదు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉందని అనుకునేవాణ్ని. ఆ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రయత్నించా. టీడీపీ తరపున కడియం శ్రీహరి గెలిచారు. ఆ తర్వాత వివిధ కారణాలతో పార్టీకి దూరమయ్యా. 2009 ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశా. అయితే ఎమ్మెల్యేనవుతానని ఎప్పుడూ అనుకోలేదు.
 
అదే.. టర్నింగ్ పాయింట్

 
మా మేనమామ కొమురుమల్లు చిన్నపెండ్యాలలో ఉండేవారు. హరిజన లేబర్ కాంట్రాక్టు సొసైటీ పేరుతో అప్పట్లోనే చిన్నచిన్న కాంట్రాక్టులు చేసేవారు. నాకున్న భావజాలం వల్ల అప్పట్లో కాంట్రాక్టర్లు అంటే నాకు వ్యతిరేకత ఉండేది. ఏదైనా కాంట్రాక్టు, టెండరు పనుల కోసం వెళ్లేటప్పుడు మా మేనమామ రమ్మని పిలిస్తే వెళ్లేవాణ్ని కాదు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పడు మా మేనమామ చనిపోయారు. వాళ్ల పిల్లలు చిన్నవాళ్లు. మేనమామ చనిపోయే నాటికి ఆయనకు ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బిల్లులు ఉన్నాయి. మరికొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో బిల్లుల కోసం బాగా తిరిగాను. అసంపూర్తి పనులు పూర్తి చేయించాను. కాంట్రాక్టరు వ్యవస్థ గురించి బాగా తెలిసింది. అలా డిగ్రీ ఫైనల్ ఇయర్‌లోనే అనివార్యంగా కాంట్రాక్టరుగా మారాను. సొంతంగా మొదట  రూ.40 వేలతో మా ఊరు చెరువు తాత్కాలిక మరమ్మతు పనులు చేశాను. నాన్న, ఊళ్లోని మిత్రులు సహకరించారు. తర్వాత రూ.2 లక్షలతో మా చెరువు శాశ్వత పనులు చేశా. రూ.5 లక్షలతో జఫర్‌గఢ్‌లో చెక్‌డ్యాం... ఇలా మొల్లమెల్లగా కొనసాగింది. ఏ పనిచేసినా ఉన్నతంగా ఉండాలని నాన్న చెప్పేవారు. దీంతో ఈ వృత్తిలోనే స్థిరపడి క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అనిపించుకోవాలనుకున్నా. కాంట్రాక్టులు చేస్తూనే పీజీ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా.
 
నిజానికి టీచింగ్ ఫీల్డే నా లక్ష్యం
 
పీహెచ్‌డీ పూర్తిచేసిన తర్వాత టీచింగ్ ఫీల్డ్‌లో సెటిల్ కావాలనుకునేవాణ్ని. మా ఊర్లోనే ఏడో తరగతి వరకు చదువుకున్నా. ఎనిమిది నుంచి పది వరకు కూనూరులో చదివా. అప్పట్లో జఫర్‌గఢ్‌లో ఆర్‌ఎస్‌యూ కార్యక్రమాలు బాగా ఉండేవి. అప్పుడప్పుడు ఆ కార్యక్రమాలకు వెళ్లేవాణ్ని. ఈ విషయంలో నాన్న ఎంతో ఆందోళన చెందేవారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బీఏ, కేయూలో ఎంఏ సోషియాలజీ పూర్తిచేశా. డిగ్రీ, పీజీ ఫస్ట్ క్లాస్‌లో పా సయ్యా. ఆ తర్వాత ఆదర్శ లా కాలేజీలో చేరినా పూర్తిచేయలేకపోయా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement