
బోనాలకు సర్వం సిద్ధం : మంత్రి తలసాని
హైదరాబాద్ : తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన బోనాల ఉత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని వివిధ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... వచ్చే నెల 2,3 తేదీల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించిన బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈసారి కొత్తగా సాంస్కృతికశాఖ తరఫున అక్కడక్కడా ప్రత్యేక స్టేజ్‌లను ఏర్పాటు చేసి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఈ వేడుకల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.