పెద్దల పోరుకు సన్నద్ధం! | arrangements for graduates elections | Sakshi
Sakshi News home page

పెద్దల పోరుకు సన్నద్ధం!

Published Sat, Nov 22 2014 2:48 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

arrangements for graduates elections

సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో మరో ఎన్నిక దగ్గరపడుతోంది. శాసనమండలిలో ఖాళీ అవుతున్న గ్రాడ్యుయేట్ల స్థానానికి ఫిబ్రవరిలో ఎన్నిక జరగనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ పదవీకాలం 2015 మార్చిలో ముగియనుంది. జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,33,506 ఓటర్లు ఉన్నారు.

నల్లగొండలో 46,291, వరంగల్ జిల్లాలో 44,512, ఖమ్మం జిల్లాలో 42,703 ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఓటు హక్కు పొందేందుకు 2011, అక్టోబరు 31కి ముందే డిగ్రీ, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నవంబరు 25 నుంచి డిసెంబరు 16 వరకు నమోదు చేసుకోవచ్చు. 2015 జనవరి 15న ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తారు. ‘పట్టభద్రుల ఓటర్ల జాబితా(2008)లో ఓటరుగా నమోదై ఉన్నవారు ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన పనిలేదు. ఓటరు గుర్తింపు కార్డు వివరాలు అందజేస్తే సరిపోతుంది. గుర్తింపు కార్డులేనివారు ఫోటో, నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది’ అని రెవెన్యూ అధికారులు చెప్పారు.

ఎన్నికలపై పార్టీల దృష్టి
తెలంగాణలో జరుగుతున్న మొదటి ఎమ్మెల్సీ ఎన్నిక అవుతుండడంతో రాజకీయంగా ప్రాధాన్యత ఉండనుంది. రాజకీయ పార్టీలకు గ్రాడ్యుయేట్స్ ఎన్నిక విషయంలో ఇప్పటి నుంచే దృష్టి పెడుతున్నాయి. ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎన్నికలే అయినా.. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులుగానే పోటీ పడడం సహజంగా జరుగుతోంది. శాసనమండలి మళ్లీ ఏర్పాటైనప్పటి నుంచి వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. రెండు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో దిగిన కపిల వాయి దిలీప్‌కుమార్ ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా జిల్లాకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును ఖరారు చేసింది.

గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు పా ర్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని బీజేపీ వరా లు చెబుతున్నాయి. మిగిలిన రాజకీయ పార్టీల్లో ఇ ప్పుడే సందడి మొదలవుతోంది. మిగిలిన పార్టీలతో పోల్చితే అధికార టీఆర్‌ఎస్‌లో ఎక్కువ మంది ఎమ్మె ల్సీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఈ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఎస్.సుందర్‌రాజు, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు.

సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటే... నల్లగొండ ఎంపీగా పో టీ చేసిన రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ప్రయత్నించనున్నారు. ఖమ్మం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీగా వైఎస్సార్‌సీపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కీలకంగా మారనుంది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా వరంగల్‌కు చెందిన బండా ప్రకాశ్‌కు అవకాశం ఇస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వామపక్ష పార్టీలు బరిలో దిగితే పొరుగన ఉన్న ఖమ్మం, నల్లగొండ నేతలకే అభ్యర్థిత్వం దక్కే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement