⇒ ఎర్రబెల్లి రాకతో కొత్త సమీకరణలు
⇒ సుధాకర్‌రావు భవితవ్యంపై చర్చలు
⇒ ప్రదీప్‌రావు మేయర్ ఆశలపై నీళ్లు
⇒ మరికొందరు నేతల్లో గందరగోళం
వరంగల్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. టీడీపీలో ఉన్నప్పుడు దయాకర్‌రావుతో విభేదించి టీఆర్‌ఎస్‌లో చేరిన వారి పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు వైఖరి నచ్చక పలువురు ముఖ్య నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు వారు టీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్నారు. ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరడంతో వీరందరూ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి వారిలో ప్రధానంగా ముగ్గురు నేతలు ఉన్నారు. వీరి భవితవ్యం ఎలా ఉంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2009 సాధారణ ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పటి వరకు దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు అరుుంది. చెన్నూరు పేరుతో ఉన్న నియోజకవర్గం పునర్విభజనలో పాలకుర్తి నియోజకవర్గంగా మారింది. 1999 నుంచి 2004 వరకు చెన్నూరు నియోజకవర్గంలో నెమరుగొమ్ముల సుధాకర్‌రావు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. 2009లో టీఆర్‌ఎస్-టీడీపీ మహాకూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. దీంతో సుధాకర్‌రావు పోటీ చేసే అవకాశం కోల్పోయారు. తర్వాత కొన్ని నెలలకు సుధాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సుధాకర్‌రావు, టీడీపీ తరఫున దయాకర్‌రావు పోటీచేయగా దయాకర్‌రావు గెలిచారు. ఇప్పుడు దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో సుధాకర్‌రావు రాజకీయ భవితవ్యంపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దయాకర్‌రావు, సుధాకర్‌రావుల మధ్య సంబంధాలు మున్ముందు ఎలా ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది.
ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో బయటి నేతల పరిస్థితి ఎలా ఉన్నా.. ఆయన సొంత తమ్ముడు వరంగల్ పట్టణ సహకార బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. 34 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న దయాకర్‌రావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా పనిచేయాలనేది దయాకర్‌రావు జీవిత లక్ష్యం. ఇదే విషయాన్ని దయాకర్‌రావు పలుసార్లు బహిరంగంగానే చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంపై హామీతోనే దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనే విషయంలో స్పష్టత లేకున్నా దయాకర్‌రావుకు మంత్రి పదవి దక్కడం మాత్రం ఖాయమని వీరు చెబుతున్నారు. ఇదే అంశం దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావుకు ఇబ్బందికరంగా మారుతోంది. 2009 ఎన్నికల్లో ప్రజరాజ్యం పార్టీ తరఫున వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రదీప్‌రావు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో కొండా మురళీధర్‌రావుతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. వరంగల్ మేయర్ పదవిపై ప్రదీప్‌రావు ఆశలు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ నాయకత్వం దయాకర్‌రావుకు మంత్రి పదవిపై హామీ ఇస్తే అదే కటుంబానికి చెందిన ప్రదీప్‌రావుకు రాజకీయంగా అవకాశాలు రావడం తక్కువేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రదీప్‌రావుకు కార్పొరేటర్ టిక్కెట్ ఇచ్చినా... సామాజిక సమీకరణల పరంగా మేయర్ పదవి ఇచ్చే పరిస్థితి ఉండదని టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. మొత్తంగా ఇద్దరు సోదరుల్లో ఒకరికే పెద్ద పదవి ఉంటుందని తెలుస్తోంది.
టీడీఎల్పీ నేతగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు తీరుపై అసంతృప్తితో టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి నాలుగు నెలల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ తనకు దక్కకపోవడానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు కారణమనే భావనతో గుండు సుధారాణి ఉన్నారు. అప్పటి నుంచి ఎర్రబెల్లి, గుండు సుధారాణి మధ్య సత్సంబంధాలు లేవు. దయాకరరావుతో అంతరం బాగా పెరగడంతో సుధారాణి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇదే మార్గంలో పయనించారు. వీరి మధ్య ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ములుగు ఎమ్మెల్యే, గిరిజన మంత్రి అజ్మీరా చందులాల్ టీడీపీలో ఉన్నప్పుడు దయాకర్‌రావుతో విభేదాలు ఉండేవి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌కు దయాకరరావుతో మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. వీరంతా ఇప్పుడు ఒకే పార్టీలో ఎలా సర్దుకుంటారనేది ఆసక్తికరంగా ఉండనుంది.
ఆ ఇద్దరికి ఇబ్బంది!
Published Fri, Feb 12 2016 2:08 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement