కుడా మోసం! | As a fraud! | Sakshi
Sakshi News home page

కుడా మోసం!

Published Thu, Oct 9 2014 3:43 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

కుడా మోసం! - Sakshi

కుడా మోసం!

  • ఎల్‌ఆర్‌ఎస్‌లో లొసుగులే పెట్టుబడిగా దందా
  •  యథేచ్ఛగా అధికారుల అవినీతి పర్వం
  •  యజమానులకు మేలు చేసేలా పాత పత్రాలతో పనులు
  •  ఎగవేసిన మొత్తంలో వాటాల వారీగా పంపకాలు
  •  ప్రభుత్వ ఆదాయూనికి భారీగా గండి
  • సాక్షి, హన్మకొండ: అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అమల్లోకి తెచ్చిన లే అవుట్ రెగ్యులరైజేషన్ చట్టం-2007 (ఎల్‌ఆర్‌ఎస్)లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి.  పలువురు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అధికారుల అవినీతి వారికి కాసులను కురిపిస్తుండగా... భూ యజమానులకు మేలు చేకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలు దారి మళ్లుతున్నాయి.

    ఎల్‌ఆర్‌ఎస్ పేరిట చేపట్టిన క్రమబద్ధీకరణలో ఎక్కువభాగం అక్రమబద్ధీకరణే జరిగినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు తేటతెల్లం  చేస్తున్నాయి. అధికారుల అండతో ప్లాట్ల యజమానులు క్రమబద్ధీకరణ సమయంలో  పాత యాజమాన్య పత్రాలు, మార్కెట్ విలువను తక్కువగా చూపుతూ ప్రభుత్వానికి చెల్లించే మొత్తాన్ని భారీగా ఎగవేస్తున్నట్లు రూడీ అయింది. ఈ అక్రమాల్లో ప్రధాన పాత్ర ‘కుడా’ అధికారులదేనని తేలింది.
     
    అధికారులకు కాసుల పంట

    అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2007లో లే అవుట్ రెగ్యులరేజైషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం లే అవుట్‌లో పార్కు లేనందుకు మార్కెట్ ధర ప్రకారం భూమి విలువలో పది శాతం జరిమానాగా... భూమి ఎంత ఉందో గజాలను బట్టి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెనాల్టీ చెల్లించాలి. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఆలస్యాన్ని బట్టి మొత్తం భూమి విలువలో కొంత మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయూలి.

    దరఖాస్తు చేసే సమయంలో భూమి యాజమాన్య పత్రాలతోపాటు దరఖాస్తులో తెలిపిన అన్ని విషయాలు నిజమేనంటూ నోటరీని సైతం సమర్పించాలి. అనంతరం అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, సర్వేయర్, డ్రాఫ్ట్‌మన్, జూనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫీల్డుకు వెళ్లి దరఖాస్తులో సమర్పించిన అంశాలు సరైనవా... కాదా... అనే అంశాలను పరిశీలించాలి.

    ఆ తర్వాత మార్కెట్ రేటు, స్థల విస్తీర్ణాన్ని బట్టి ఎల్‌ఆర్‌ఎస్ పెనాల్టీని విధించాలి. ప్లానింగ్ అధికారి పరిశీలించిన తర్వాతే సదరు స్థలాన్ని క్రమబద్ధీకరించాలి. అయితే ఎల్‌ఆర్‌ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూముల ధరలు గరిష్టంగా పదిరేట్ల వరకు పెరిగాయి. ఇందుకు తగ్గట్లుగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తే ఏమొస్తుందని అనుకున్నారో.. ఏమో... కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన పలువురు అధికారులే ఎల్‌ఆర్‌ఎస్ చట్టంలోని లొసుగులను ఒడిసిపట్టి అక్రమార్జనకు తెగబడ్డారు.

    లే అవుట్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు అందగానే అక్కడి సిబ్బంది అలర్ట్ అవుతున్నారు. ప్రభుత్వానికి ఎక్కువ మొత్తం చెల్లిస్తే ఏం లాభం... మేం చెప్పినట్లు పాత తేదీలతో ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్లతో పని కానిచ్చేద్దాం... మిగిలింది ఫిఫ్టీ-ఫిఫ్టీగా పంచుకుందామంటూ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని దండుకుంటున్నారు. ఇలా భూ యజమానులకు మేలు జరుగుతుండగా.. సదరు అధికారుల జేబులు నిండుతున్నాయి. ప్రభుత్వ ఆదాయూనికి మాత్రం గండిపడుతోంది.
     
    సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన వివరాలు
     
    హన్మకొండ న యీంనగర్‌లో సర్వే నంబర్లు 5-980, 5-981,5-982లో ఉన్న 1721 చదరపు మీటర్ల  స్థలాన్ని 1998లో రేచర్ల శ్రీనివాసరావు కొనుగోలు చేశాడు. ఈ స్థలాన్ని 2003, 2009లో పలు విడతల్లో రేవూరి కిషన్‌రెడ్డికి, అతడి కుటుంబ సభ్యులకు విక్రయించాడు. ఈ మేరకు ఈ ఆస్తికి హక్కుదారులుగా రేవూరి కిషన్‌రెడ్డి, అతడి కుటుంబీకులు ఉన్నారు. ఇందుకు సంబంధించి సేల్స్ డీడ్స్ రికార్డులు ఉన్నాయి.

    ఈ స్థలాన్ని క్రమబద్ధీకరించాలంటూ 2010 మేలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి దరఖాస్తు అందింది. ప్రస్తుతం ఈ భూమికి యజమానిగా ఉన్న రేవూరి కిషన్‌రెడ్డి పేరుతో కాకుండా గత యజమాని అయిన రేచర్ల శ్రీనివాసరావు పేరుతో దరఖాస్తు అందింది. పరిశీలనకు వెళ్లిన ‘కుడా’ అధికారులు ఈ అంశంపె ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండానే పాత డాక్యుమెంట్ల ఆధారంగా 1998 మార్కెట్ ధర ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, పెనాల్టీ కింద రూ 4,27,860 చెల్లించాల్సిందిగా నిర్ధారించారు. దరఖాస్తు వివరాల ప్రకారం ఈ మొత్తాన్ని స్థల యజమాని అయిన రేచర్ల శ్రీనివాసరావు చెల్లించాలి.

    అయితే కార్పొరేషన్ బ్యాంకులో డిమాండ్ డ్రాఫ్టును రేవూరి కిషన్‌రెడ్డి పేరుతో తీసి ‘కుడా’కు అందినట్లు ఉంది. ముందుగా కుదిరిన ఒప్పందమో... కావాలని చేసిన తప్పిదమో.. దరఖాస్తుదారులు ఎవరు, డబ్బులు చెల్లించినవారు ఎవరనేది పరిశీలించకుండా పని పూర్తి చేసినట్లు స్పష్టమవుతోంది. ఎల్‌ఆర్‌ఎస్ చట్టం అమల్లో ఉన్న కాలంలో 90 శాతం పనులు ఈ విధంగా అక్రమ పద్ధతిలో కొనసాగినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.
     
     ‘కుడా’లో అంతా అక్రమమే
     ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ‘కుడా’లో పెద్ద కుంభకోణం జరిగింది. నా ప్రమేయం లేకుండా నా సంతకాలు ఫోర్జరీ చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ‘కుడా’ అధికారుల అండదండలతోనే ఇది జరిగింది. ఎల్‌ఆర్‌ఎస్ అక్రమాలపై విచారణ చేయాలి.
     - రేచర్ల శ్రీనివాసరావు
     
     ఆయనకు తెలిసే జరిగింది
     సర్వే నంబర్లు 5-980, 5-981,5-982లో ఉన్న 1721 చదరపు మీటర్ల స్థల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రతి పనీ రేచర్ల శ్రీనివాసరావుకు తెలిసే జరిగింది. ఆయనే దగ్గరుండి ఎల్‌ఆర్‌ఎస్‌లో పాల్గొన్నారు.  వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు ఈ రోజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
     - రేవూరి కిషన్‌రెడ్డి
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement