
సాక్షి, హైదరాబాద్: గాడ్సే వారసులు తనను హతమార్చినా ఆశ్చర్యపోనవసరం లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మహాత్మా గాంధీనే చంపేసిన వారికి అసదుద్దీన్ ఒవైసీ ఒక లెక్కా? అని ప్రశ్నించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం మాత్రం తాను ఆపబోనని స్పష్టం చేశారు.
బుధవారం హైదరాబాద్‌లోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుస్సలాంలో అసద్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న బీజేపీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవాచేశారు. కశ్మీరీలు సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని పంచుకునేందుకు ఫోన్లు ఎందుకు కట్ చేశారని ప్రశ్నించారు.