అర్హులందరికీ ‘ఆసరా’ | Asara for all eligibles, says kcr | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ‘ఆసరా’

Published Sun, Nov 9 2014 2:05 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ఓ వృద్ధుడికి పెన్షన్ కార్డును ఇస్తున్న కేసీఆర్ - Sakshi

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ఓ వృద్ధుడికి పెన్షన్ కార్డును ఇస్తున్న కేసీఆర్

పింఛన్లపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారు: సీఎం కేసీఆర్
 
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పింఛన్లు, రేషన్‌కార్డుల అంశంపై తెలంగాణ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఈ విషయంలో కొందరు దుర్మార్గులు విష ప్రచారం చేస్తున్నారని, దానిని నమ్మొద్దని ఆయన చెప్పారు. తనను చంపినా సరే.. అబద్ధాలు, దొంగమాటలు చెప్పాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో శనివారం ‘ఆసరా’ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కావాలని    అనుకున్నామని, అందుకు చాలా కష్టపడ్డామని, ఎంతో మంది ఆత్మ బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కష్టాలు ఉన్నాయని నేను ఎన్నికల సమయంలోనే చెప్పిన. కేసీఆర్‌ను చంపినా సరే.. దొంగ మాటలు చెప్పే అవసరం నాకు లేదు. ముక్కుసూటిగా మాట్లాడటమే నాకు తెలిసిన విద్య. అబద్ధాలు చెప్పడమో, రాజకీయాల కోసం ప్రజలను గోల్‌మాల్ చేయడమో అది నా జన్మకే లేదు. రేషన్‌కార్డులు, పింఛను తొలగిస్తారంటూ కొంతమందిలో రకరకాల అనుమానాలు ఉన్నాయి. దీనిపై కొందరు దుర్మార్గులు విష ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దు. ఒక్క అర్హుడిని కూడా వదిలి పెట్టకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పింఛన్, రేషన్‌కార్డులు ఇస్తది. అనర్హులకు కార్డులు అందకుండ చూస్తం. ఎవరికైనా అర్హత ఉండీ కార్డులు రాకపోతే తహసీల్దార్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోండి. మళ్లీ విచారణ జరిపించి కార్డులు ఇస్తం. కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా ఒక్కొక్కరికి ఆరుకిలోల బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున ఎలాంటి సీలింగ్ లేకుండా ఇస్తం..’’ అని సీఎం పేర్కొన్నారు.
 
 మాట మీద నిలబడతాం..
 
 అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు ఇస్తామని, మాట మీద నిలబడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘ఎన్నికల సమయంలో సాధారణంగా రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తరు. మనం ఇక్కడ రుణమాఫీ చేస్తమని చెప్పి అమలు చేసిన ం. రాబోయే రెండేళ్లలో మొత్తం రుణ మాఫీ చేయబోతున్నం. అదే ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తమని చెప్పి.. ఈ రోజుకు కూడా ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. కరెంట్ కష్టాలు ఉంటాయని మీ అందరికీ ఎన్నికల్లోనే చెప్పిన. అది షాపులో దొరికే వస్తువు కాదు. ఛత్తీస్‌గఢ్ నుంచి రావాలె. దానికి మరో ఏడాదిన్నర పడుతది. మూడేళ్ల తర్వాత ఒక్క క్షణం కూడా కరెంట్ పోనివ్వం. ఇది కేసీఆర్ మాట. ప్రజలు, రైతులు సహకరించాలని కోరుతున్నాను..’’ అని పేర్కొన్నారు.
 
 రెండు పూటలా తిండి పెట్టాలనే..
 
 గత ప్రభుత్వాలు కేవలం పింఛన్ల పేరిట కొద్దిపాటి డబ్బులిచ్చి చేతులు దులుపుకొన్నాయని, కానీ తాము నిరుపేదలకు రెండుపూటలా తిండిపెట్టడంతో పాటు వారి ఇతర అవసరాలు కూడా తీరాలనే ఉద్దేశంతో ‘ఆసరా’ను అమలు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకే వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ. 1,500 చొప్పున ఇస్తున్నామని తెలిపారు. పింఛన్ల విషయంలో గత ప్రభుత్వాలు తమాషాలు చేశాయన్నారు. టీడీపీ ప్రభుత్వం పింఛన్ల కోసం ఖర్చుపెట్టింది రూ. 67 కోట్లు మాత్రమేనని, అప్పుడు ఒక్కక్కరికి ఇచ్చింది 75 రూపాయలేనని సీఎం చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల దాకా ఖర్చు చేసిందని... కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 1,000, రూ. 1,500 చొప్పున ఇచ్చేందుకు రూ. మూడు వేల కోట్లు ఖర్చు పెడుతోందని వెల్లడించారు.
 
 గ్రామీణ రోడ్లకు ప్రాధాన్యమిస్తాం..
 
 గ్రామీణ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఉపయోగపడే గ్రామీణ రోడ్ల మరమ్మతులకు అత్యంత ప్రాధాన్యమిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో గత పాలకులు నిర్లక్ష్యం చేసిన 20 వేల కిలోమీటర్ల బీటీ రోడ్లను రూ. 600 కోట్ల వ్యయంతో మెరుగుపరుస్తామన్నారు. సమైక్యాంధ్ర పాలనలో ఆంధ్రా నాయకుల కుత్సిత వైఖరితో తెలంగాణలో చెరువులు సర్వ నాశనమయ్యాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల చెరువుల్లో ఏడాదికి 9 వేల చొప్పున చెరువులను పునరుద్ధరిస్తామని కేసీఆర్ వెల్లడించారు. దాంతోపాటు తాగునీటి కోసం వాటర్‌గ్రిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూ. 30 వేల కోట్లతో చేపడుతోందని, దానికి సర్వే కోసం ఇటీవల రూ. 110 కోట్లు విడుదల చేశామని తెలిపారు. సర్వే పూర్తయిన వెంటనే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌కు శంకుస్థాపన చేస్తామని సీఎం చెప్పారు.
 
 నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగం..
 
 మళ్లీ ఎన్నికలు వచ్చేలోపు ఊరూవాడా తేడా లేకుండా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే బాధ్యత తనదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘మీ బిడ్డగా శపథం చేస్తున్నా.. ప్రతీ ఇంటికీ నల్లా ఇవ్వకపోతే మళ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మీ ఓట్లడగదు. నిబద్ధత, ధైర్యం, మీ అందరి దీవెన, సహకారం, అండదండలు ఉంటేనే హరిత తెలంగాణ సాధ్యమవుతుంది. పేదల ముఖంలో చిరునవ్వుతో కూడిన తెలంగాణను చేసి అప్పచెప్పే బాధ్యత నాది..’’ అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement