
ఎల్‌బీ నగర్ ఏఎస్సై అంజయ్య (ఫైల్)
నాగోలు: ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న బి. అంజయ్య (56) సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఫలక్‌నుమాకు చెందిన అంజయ్య 1989 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్. నగరంలోని పలు పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహించి ఏఎస్సైగా పదోన్నతి పొందారు. శంషాబాద్ పోలీసు స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన ఎల్‌బీనగర్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
ఆయనకు భార్య ముగ్గరు కుమారులు, ఒక కూతురు ఉంది. విశ్రాంతి లేకుండా తరుచుగా బందోబస్తుకు వెళ్తున్నందున గత కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా ఉండటంలేదు. సోమవారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకొని రెస్టురూమ్‌లో వెళ్లిన ఆయన ఒక్క సారిగా గుండెనొప్పితో కూలిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఎల్‌బీనగర్ సీఐకి సమాచారం అందించి, పోలీస్ వాహనంలో కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఈ విషయన్ని తోటి సిబ్బంది అంజయ్య కుంటుంబ సభ్యులు తెలిజేశారు. విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎల్‌బీనగర్ ఏసీపీ పృథ్వీధర్‌రావు, ఎల్‌బీనగర్ సీఐ అశోక్‌రెడ్డి తదితరులు అక్కడికి వచ్చి అంజయ్య మృతదేహం వద్ద నివాళ్లు అర్పించారు. అంజయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.