హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఏమైందని అఖిలపక్ష నాయకులు స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ను ప్రశ్నించారు.
హుస్నాబాద్: హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఏమైందని అఖిలపక్ష నాయకులు స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ను ప్రశ్నించారు. కాలయాపన చేస్తే సమస్య మరుగున పడిపోతుందని, చేతకాకపోతే తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే హన్మకొండ నుంచి హుస్నాబాద్‌కు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న రెవెన్యూ డివిజన్ సాధనసమితి కన్వీనర్ మేకల వీరన్నయాదవ్, అఖిల పక్ష నాయకులు కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, హసన్, కొత్తపల్లి అశోక్, నోముల శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్, శివరాజ్‌నాయక్, బంక చందు, గవ్వ వంశీధర్‌రెడ్డి తదితరులు అంబేద్కర్‌చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు.
ఎమ్మెల్యే వాహనం రాగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనాన్ని అడ్డుకునేందుకు ముందుకు ఉరికారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈక్రమంలో తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయినా నాయకులు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్‌తో పాటు హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు.
అసలు డివిజ్ ఏర్పాటు చేస్తారా.. లేదా.. సమాధానం చెప్పాలన్నారు. చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పనున్నట్లు గమనించిన సీఐ సదన్‌కుమార్, ఎస్సై మహేందర్ ఆందోళనకారులను పక్కకు తప్పించారు. కాంగ్రెస్ నాయకులు కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, హసన్, సీపీఐ, బీజేపీ కార్యకర్తలు మాడిశెట్టి శ్రీధర్, కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు గవ్వ వంశీధర్‌రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆరుగురి బైండోవర్
ఎమ్మెల్యే వాహనశ్రేణిని అడ్డుకున్న ఆరుగురు నాయకులను పోలీసులు బైండోవర్ చేశారు. కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, హసన్, మాడిశెట్టి శ్రీధర్, కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, గవ్వ వంశీధర్‌రెడ్డిని తహశీల్దార్ విజయసాగర్ ఎదుట బైండోవర్ చేశారు.