
డబుల్’ లొల్లి
► చిన్నముల్కనూర్‌లో గ్రామసభ రసాభాస
► అనర్హులను ఎంపిక చేశారని నిలదీత
► అధికారులతో గంటసేపు వాగ్వాదం
► వాహనాన్ని అడ్డుకుని ఆందోళన.. ధర్నా
► పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
చిగురుమామిడి : సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మండలంలోని చిన్నముల్కనూర్‌లో డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల గొడవ ముదిరింది. లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ పలువురు గ్రామస్తులు అధికారులను నిలదీశారు. అర్హులకు అన్యాయం చేశారంటూ తీవ్రస్థారుులో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. పోలీసుల జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది. చిన్నముల్కనూర్‌లో డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక కోసం శుక్రవారం కరీంనగర్ ఆర్డీఓ చంద్రశేఖర్, ట్రెరుునీ అసిస్టెంట్ కలెక్టర్ గౌతమ్, తహసీల్దార్ రాజు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామస్తులంతా గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ముందుగానే సమావేశమై అధికారుల రాకకోసం ఎదురుచూశారు. అధికారులు మధ్యాహ్నం 3గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఆర్డీవో చంద్రశేఖర్ డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జాబితాను చదివి వినిపించారు.
దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఒక్కసారిగా లేచి అధికారులను నిలదీశారు. సర్పంచ్ మకుటం రాజయ్య మినహా గ్రామంలోని ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులందరూ మూకుమ్మడిగా అధికారులను నిలదీశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సభావేదికపై ఉన్న అధికారులపై దూసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంతనచ్చజెప్పినా గ్రామస్తులు వినలేదు. గుంపులు గుంపులుగా వచ్చిపోతూ దాదాపు గంటసేపు అధికారులను నిలదీశారు. అవసరమైతే మళ్లీ ఎంపిక ప్రక్రియను చేపడతామని చెప్పినా వారు వినలేదు. విసిగివేసారిన అధికారులు చివరికి నిస్సహాయులై కూర్చున్నారు.
187 మందిలో 40 మందిని ఎలా ఎంపిక చేస్తారు...?
చిన్నముల్కనూర్‌లో మొదటి విడతగా మంజూరైన 247 డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు కాకుండా సీఎం కేసీఆర్ అదనంగా మరో 200 ఇండ్లను మంజూరు చేస్తానని హామీ ఇవ్వగా.. స్థానిక అధికారులు గ్రామంలో 187 మంది అర్హులున్నారని నివేదిక పంపారు. దీనిపై ఆర్డీఓ, తహసీల్దార్ లోతుగా పరిశీలించి వడబోయగా 40 మంది అర్హులు తేలారు. వారికి ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు గ్రామసభలో చదివి వినిపించారు. దీంతో అలజడి ప్రారంభమైంది. ఎస్సీలకు సరైన న్యాయం జరగలేదని, డబ్బులు ఇచ్చినవారికే ఇండ్లు మంజూరు చేస్తున్నారని, అర్హులైన బీసీలు ఉన్నా సర్పంచ్ పట్టించుకోవడంలేదని, తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అధికారులను ఘెరావ్ చేసిన గ్రామస్తులు
గ్రామసభను ఇక నడవనీయరని భావించిన అధికారులు వాహనంలో కూర్చుని వెళ్తుండగా ఉపసర్పంచ్ సాంబారి బాబు నేతృత్వంలో గ్రామస్తులు వాహనానికి అడ్డుకున్నారు. వాహనం ముందు పడుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వాహనం వెనుకకు వెళ్లేందుకు ప్రయత్నించగా వెనుకభాగాన కూడా బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు వాహనం దిగి గ్రామపంచాయతీ కార్యాలయంలోకి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య తన సిబ్బందితో చిన్నముల్కనూర్‌కు చేరుకుని గ్రామస్తులను శాంతింపజేశారు. దీంతో అధికారులు వెళ్లిపోయారు. అధికారులను అడ్డగిస్తే కేసుల పాలవుతారని, ఇది మంచిదికాదని హెచ్చరించడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటారుుంపులో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన తప్పిదానికి సీఎంను నిందించడం సరైందికాదని టీఆర్‌ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు. గ్రామస్తుల ఆందోళన విరమించిన తర్వాత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వీరమల్ల చంద్రయ్య, సర్పంచ్ మకుటం రాజయ్య, ఎంపీటీసీ సంగీత, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ముప్పిడి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాంబారి కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.