సెప్టెంబర్ తొలివారంలో అసెంబ్లీ | Assembly in the first week of September | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ తొలివారంలో అసెంబ్లీ

Published Tue, Aug 5 2014 1:09 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

Assembly in the first week of September

 హైదరాబాద్: వచ్చే నెల తొలి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా నిర్ణయించారు. స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతోపాటు ముఖ్య అధికారులతో కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల తేదీలు, రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఏకకాలంలో జరిగే అవకాశమున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చించారు. సెప్టెంబర్ 3వ తేదీన సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించారు.

ఆరోజువీలు కాకుంటే 5న ప్రారంభించాలన్న అభిప్రాయానికి వచ్చారు.   రాష్ట్ర తొలి బడ్జెట్‌ను 10వ తేదీన ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా అనుకున్నారు. కనీసం 21 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి ఒక రోజు, ధన్యవాద తీర్మానంపై చర్చకు మూడు రోజులు, ఆ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఒక రోజు కేటాయిస్తారు. 8 రోజులపాటు వివిధ పద్దులపై చర్చ జరుగనుంది. మరో 6 రోజులపాటు బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతుంది. ద్రవ్య వినిమయ బిల్లు, సీఎం సమాధానాన్ని మిగిలిన మూడు రోజుల్లో పూర్తిచేయనున్నారు.  దీనిపై శాసనసభా వ్యవహారాల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కాగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు దాదాపు ఒకే సమయంలో జరగనున్న నేపథ్యంలో ఇద్దరు స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాదరావు మంగళవారం భేటీ కానున్నారు.     
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement