నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు | Assembly budget session from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Published Wed, Nov 5 2014 2:26 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు - Sakshi

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

సాక్షి, హన్మకొండ : ‘జూరాల-పాకాల’కు అడుగు పడేనా..‘దేవాదుల’ వేగిరమయ్యేనా... ‘కంతనపల్లి’కి నిధులు వచ్చేనా..ఇండస్ట్రియల్ కారిడార్‌కు స్థానం దక్కేనా....ఇలా తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తొలిసారిగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశతో ఉన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ‘తొలి’ అడుగుతో దశ తిరిగేనా అని కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేతిలోని మంత్రదండం జిల్లాకు నిధుల వరద పారించేనా అని ముందస్తుగా లెక్కలు వేస్తున్నారు.

జిల్లా ప్రజల్లో భారీ అంచనాలు ఉండడంతో జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఆరూరి రమేశ్ బడ్జెట్ సమావేశాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ నియోజకవర్గాలకు ఏ మేరకు నిధులు వస్తాయోనని అంచనాల్లో మునిగారు.

ఇప్పటికే మన  ఊరు- మన ప్రణాళిక  కార్యక్రమం ద్వారా గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు వివిధ స్థాయిల్లో చేపట్టాల్సిన పనులు, నిధుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. వీటితోపాటు జూరాల-పాకాల, వాటర్‌గ్రిడ్, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీటి ఆధారంగా జిల్లాకు పలు పథకాలు, నిధులను బడ్జెట్ సమావేశాల వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంది.

సాగునీటికి పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు దివరకే స్పష్టం చేసింది. జిల్లాలో 5,61,229 ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పదేళ్ల కిందట ప్రారంభించినా... పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు పూర్తి కాలేదు. మూడు దశల్లో రూ. 9,427 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉండగా... గడువు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో నిర్మాణ వ్యయం అదనంగా రూ. 1976 కోట్లు పెరిగింది.  మొదటి దశ పనులు పూర్తి కాగా, రెండో, మూడో దశ పనులు ఏళ్లు గడిచినా.. కొనసాగుతూనే ఉన్నాయి.

ఆ తర్వాత  బహుళార్ధక ప్రాజెక్టుగా ఐదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన కంతనపల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. కంతనపల్లికి సంబంధించిన డిటైల్డ్‌ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను 2014 ఆగస్టులో ప్రభుత్వానికి పంపించారు. మొత్తం 131 గేట్లతో అతి పెద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్లాన్ రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు పనులు వేగం చేసేలా ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించేందుకు ఆస్కారం ఉంది. కంతనపల్లి పూర్తయితే దేవాదుల ప్రాజెకు ్టద్వారా ఎక్కువ రోజుల నీటిని వాడుకునే అవకాశం ఏర్పడుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో జిల్లా ఉన్నప్పటికీ  ఒక్క చుక్క వాటా కూడా వరంగల్ జిల్లాకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జూరాల-పాకాల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.    

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వచ్చే మూడేళ్లలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేస్తే... ఏకంగా 3.60 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే వీలుంటుంది. మహబూబ్‌నగర్ జిల్లా జూరాల నుంచి కృష్ణానది నీళ్లను మహబూబ్‌నగర్, నల్లగొండ మీదుగా వరంగల్ జిల్లా  ఖానాపూర్ మండలం పాకాల వరకు తీసుకొస్తారు. ఈ మూడు ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

గ్రేటర్ చిక్కులు తీరేనా...
హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండిస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి పరచడం ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటిగా ఉంది. దీనికనుగుణంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధి, కార్యక్రమాల విస్తరణ, పెండింగ్‌లో ఉన్న వ్యాగన్ పరిశ్రమకు భూమి కేటాయింపు, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.  తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ నగర పాలక సంస్థను గ్రేటర్‌గా మార్చే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ గ్రేటర్ ప్రకటన వెలువడే ఉంది.  అదేవిధంగా... నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆశిస్తున్నారు.

చెరువుల అభివృద్ధి..
 రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునురుద్ధరణ, తాగునీటి పథకాలకు (వాటర్‌గ్రిడ్) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.  జిల్లాలో మొత్తం 1400 చెరువులు ఉన్నాయి. వీటిలో మొదటిదశ కింద 250 చెరువులను పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు. వీటికి దాదాపు రూ.500 కోట్ల వ్యయం అవుతుంద ంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. వాటర్‌గ్రిడ్‌లో భాగంగా జిల్లాలో సుమారు  రూ 5,700 కోట్ల వ్యయంతో ఐదు గ్రిడ్‌లు ఏర్పాటు చేసి... జిల్లాలో అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మొదటి దశకు సంబంధించిన నిధులు ఈ బడ్జెట్‌లో మంజూరయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement